నెల్లూరు(క్రైమ్): కుటుంబ కలహాలో?, ఆర్థిక ఇబ్బందులో? మరే ఇతర కారణమో తెలియదుగానీ గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్ – రంగనాయకులపేట రైల్వేగేటు మధ్య లూప్‌లైన్‌లో చోటుచేసుకుంది. మృతుడి వయసు 45 నుంచి 50 సంవత్సరాల్లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. బులుగు, నలుపు, తెలుపు రంగుల చెక్స్ కలిగిన ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, బులుగు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీస్‌స్టేషన్, 92475 75628 నంబర్లకు తెలియజేయాలని ఎస్సై కోరారు.
పోలింగ్‌కు వేళాయె
● స్థానిక సమరానికి సర్వం సిద్ధం
● సమస్యాత్మక గ్రామాల్లో 144 సెక్షన్ అమలు
● పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది, పోలీసులు
సైదాపురం: మండలంలోని జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, ఎంపీడీఓ ఎంవీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్ అధికారులకు ఎన్నికల సామగ్రిని అందజేసి వారు మాట్లాడారు. మొత్తం 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎంపీటీసీ బరిలో 28 మంది, జెడ్పీటీసీకి ఇద్దరు రంగంలో ఉన్నట్లు వారు చెప్పారు. మొత్తం 39,531 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళలు 20,314 మంది, పురుషులు 19,217 మంది ఉన్నట్టు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు సమస్యాత్మక గ్రామాల్లోని కేంద్రాల వద్ద అదనపు పోలీసులతోపాటు ఇద్దరు, సీఐలు, ముగ్గురు ఎస్సైలను కేటాయించినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు వెల్లడించారు.
● రాపూరు: మండలంలో 55 పోలింగ్ బూత్‌లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లుగా ఆర్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. రాపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. మొత్తం 40,628 మంది ఓటర్లు ఉన్నారు.
వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి
ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని టిడ్కో భవనాల ఎదురుగా ఖాళీ స్థలంలో బుధవారం ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై జంపాని కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. మృతుడు యాచకుడని, అనారోగ్య పరిస్థితులతో మృతిచెందినట్లుగా వెల్లడించారు.
● వింజమూరు మార్గంలో పమిడిపాడు అడ్డరోడ్డు వద్ద బస్సు షెల్టర్ సమీపంలో మరో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అక్కడ సైతం విచారణ చేయగా ఆ మృతదేహం సైతం యాచకుడిదిగా గుర్తించామని ఎస్సై వెల్లడించారు. ఈ మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఖననం చేయించినట్లు తెలిపారు.
కండలేరులో 16.723 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 16.723 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


