సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు మేయర్, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం చైర్‌పర్సన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య ఓటు ఓడిపోయింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసింది. ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని భావించి నామినేషన్లను అడ్డుకుంది. పచ్చమూకలు, గూండాల దాష్టీకాలను ఎదురించి దాఖలు చేసిన నామినేషన్లను ఆర్వోలపై ఒత్తిడి పెట్టి చిన్నచిన్న కారణాలు చూపించి తిరస్కరించింది. మిగిలిన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు తాయిలాలు ఎరవేసింది. అక్కడికి లొంగని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులతో బెదిరించింది. పోలింగ్ రోజూ అడ్డదారులు తొక్కారు. చివరకు కౌంటింగ్ ప్రక్రియలోనూ ఇదే తంతును కొనసాగించారు.
టీడీపీది అనైతిక విజయమే
పురపోరులో జిల్లాలో కూటమి కుట్రలు, కుయుక్తులు, ప్రలోభాలు, తాయిలాలు వెరసీ టీడీపీ అనైతిక విజయం సాధించింది. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంను టీడీపీ తమ ఖాతాలో వేసుకుంది. తారుమారు ఓట్లతో ఆత్మకూరులో స్వల్ప ఆధిక్యంతో టీడీపీ గెలుపొందినట్లు ప్రకటించుకుంది. ఇదే మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు విజయం సాధించినట్లు ముందు ప్రకటించినా.. చివరకు రీ కౌంటింగ్ పేరుతో ఆ రెండు స్థానాలను టీడీపీ తమ ఖాతాలో వేసుకుంది. వైఎస్సార్‌సీపీ గెలిస్తే రీకౌంటింగ్.. టీడీపీ గెలిస్తే విజయంగా ప్రకటిస్తూ ఎన్నికల అధికార యంత్రాంగం సైతం అడ్డగోలుగా వ్యవహరించింది. నెల్లూరులో పుర పోరు ఆరంభం నుంచి కుట్ర రాజకీయం చేసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టార్గెట్ చేసి బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేశారు. 8 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. గెలిచి ధీమా ఉంటే.. ఓటుకు నోటు.. పోటీ నుంచి తప్పుకుంటే నోట్ల కట్టల రాజకీయం చేసేది కాదు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 58వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుస్తారనే భయంతోనే నెల్లూరు చిన్నబజారు సీఐ సీతారామయ్యతో రూ.70 లక్షలకు బేరం పెట్టిన ఆడియో కూడా బయటకు వచ్చింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటే.. రూ.70 లక్షలు ఎందుకు బేరం పెట్టినట్లు ఆలోచించాల్సిన విషయం. ఇక ఎన్నికల సమయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటుకు రూ.2 వేలు, నెల్లూరు రూరల్ పరిఽధిలో ఓటుకు రూ.వెయ్యి వంతున పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటుకు రావద్దని బెదిరించారు. పోలింగ్ సమయంలో ప్రతి బూత్‌లో సైక్లింగ్ పద్ధతిలో రిగ్గింగ్, దొంగబఓట్లు వేసుకున్నారు. అధికారానికి ఎన్నికల అధికార యంత్రాంగం సైతం దాసోహమైంది. పోలీస్‌శాఖ గులాంగిరి చేయడంతో అనైతిక విజయం సాధించింది.
నోట్ల మద్దతుతో ఓట్లు
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో టీడీపీ ప్రజామద్దతు కంటే.. నోట్ల మద్దతుతోనే విజయం సాధించింది. ఇక్కడ టీడీపీ కుట్రలు పతాక స్థాయికి చేరుకున్నాయి. నామినేషన్ల ఘట్టం నుంచి ప్రలోభాలతో వైఎఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఓటుకు నోటుతోపాటు తాయిలాలు ప్రకటించారు. అధికార దుర్వినియోగం పాల్పడ్డారు. ఐదు వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. చివరకు కౌంటింగ్ సమయంలో కూడా టీడీపీ నేతలు హల్‌చల్ చేశారు. నాలుగో వార్డులో 50 ఓట్ల మెజర్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించినా వెంటనే ప్రకటించకుండానే నాలుగు గంటల పాటు బేరసారాలతో కౌంటింగ్ కేంద్రంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి రూ.40 లక్షల వరకు నగదు ఆఫర్ చేశారు. నాలుగు సార్లు రీకౌంటింగ్ జరిపి బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటన చేసే ప్రయత్నాలు చేశారు. చివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి న్యాయపొరాటం చేస్తానని ధీటుగా ఎదుర్కోవడంతో గత్యంతరం లేక మూడు ఓట్లతో విజయం సాధించినట్లు ప్రకటించారు.
కూటమి విజయంలో కుట్రలు
ఆత్మకూరులో కూటమిలో అనేక ఎన్నో కుట్రలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చైర్‌పర్సన్ అభ్యర్థి దొరక్కపోవడంతో వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్న దివంగత మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కుటుంబంలో చీలిక తెచ్చి ఆ ఇంటి నుంచి అభ్యర్థిని రంగంలోకి దింపారు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడి పలువురు వైద్యులకు పార్టీ కండువా కప్పారు. 28 వార్డుల్లో రెండు వార్డులను అడ్డగోలుగా ఏకగ్రీవం చేసుకొగా 26 వార్డుల్లో ఎన్నిక జరిగింది. మంత్రి ఆనం అక్కడే తిష్టవేసి ఎన్నికల నిర్వహణ చేశారు. పొలింగ్ రోజు నాలుగు వార్డుల్లో దొంగ ఓట్లు వేయించుకున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా చైర్‌పర్సన్ అభ్యర్థి కేవలం 2,206 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ 12 వార్డుల్లో విజయం సాధించగా, రెండు వార్డుల్లో రీకౌంటింగ్ పేరుతో తిరిగి కూటమి ఖాతాలోనే వేశారు. కూటమికి ధీటుగా వైఎస్సార్‌సీపీ పొరాటం చేసి నైతిక విజయం సాధించింది.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన
రెడ్‌బుక్ రాజ్యాంగం
ఆద్యంతం కుట్రలు.. కుతంత్రాలు.. దొంగ ఓట్లు, బోగస్ కౌంటింగ్
ఫలితాలను తారుమారు చేశారనే
ఆరోపణలు
అన్ని చోట్ల ఒకటే ఎత్తుగడ
స్వల్ప ఆధిక్యంతో కూటమి ఖాతాలో ఆత్మకూరు
బుచ్చిరెడ్డిపాళెంలో ఆఖరి వరకు కుయుక్తులు
నాల్గో వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం సాధించినా నాలుగుసార్లు రీకౌంట్
నాలుగు గంటల పాటు ప్రలోభాలు పెట్టినా తలొగ్గని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
ఆఖరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
గెలుపొందినట్లు డిక్లేర్
వైఎస్సార్‌సీపీ
ఓడిపోలేదు..
బ్యాలెట్ పత్రాల్లో గెలిచింది
నెల్లూరు మేయర్, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం చైర్‌పర్సన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులోనూ కౌంటింగ్ సిబ్బందితో తారుమారు కుట్రలకు తెగించింది. వాస్తవంగా వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదని, బ్యాలెట్ పత్రాల్లో గెలిచిందని, ఓట్లను తారుమారు చేసి కూటమి ఖాతాలో వేసుకుందనే ఆరోపణలకు అద్దం పడుతూ కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి వైఎస్సార్‌సీపీ తరఫున టేబుల్‌కు ఒక్కరినే అనుమతి ఇస్తే.. కూటమి నుంచి ముగ్గురిని అనుమతించారు. ఒక్కొక్క టేబుల్‌కు నలుగురు కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ ఒక్కడే ఉన్నారు. నలుగురు కౌంటింగ్ సిబ్బంది ప్రతి ఓటును చూపించి అనుమతి పొందాకే.. ఏ పార్టీకి వస్తే.. వారి ఖాతాలో వేయాలి. కానీ.. ఇక్కడ ఒక బ్యాలెట్ చూపించి... నాలుగు ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా వైఎస్సార్‌సీపీ గెలుపును సైతం తారుమారు చేశారంటూ అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రౌండ్‌కు ఫలితాలను పారదర్శకంగా ప్రకటించాల్సిన కౌంటింగ్ అధికారులు.. గంటల కొద్దీ జాప్యం చేయడం వెనుక కుట్రకోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


