● రాత్రి వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు
నెల్లూరు(బారకాసు): నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం.. చివరకు అత్యంత రహస్యం పాటించారు. దీని వెనుక ఏ మతలబు జరిగిందో అంతుపట్టడం లేదు. నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో మంగళవారం ఓట్లు లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా.. రెండు గంటలు అలస్యంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. నగరంలో 72 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 8 డివిజన్లను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. 64 డివిజన్లలో కార్పొరేటర్లు, 72 డివిజన్లలో మేయర్ అభ్యర్థులకు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి రౌండ్‌కు ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నా.. బయటకు రానివ్వకుండా రహస్యంగా ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకంతా తుది ఫలితాలు వెల్లడిస్తామని చెప్పిన అధికారులు ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి ఫలితాలను సైతం వెల్లడించకపోవడం, రాత్రి వరకు మేయర్ ఓట్ల లెక్కింపు కొనసాగించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మేయర్ ఓట్లపై సాయంత్రం వరకు అధికారికంగా ప్రకటించకుండా జాప్యం చేయడం వెనుక ఫలితాలను తారుమారు చేసే కుట్రలు జరిగాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆది నుంచి అధికార యంత్రాంగం గందరగోళానికి తెరతీశారు. కౌంటింగ్ కోసం కేటాయించిన గదుల నంబర్లకు, పోటీ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు ఇచ్చిన గదుల నంబర్లలో తేడాలుండడంతో కొంత గందరగోళం నెలకొంది. ఏ గదిలోకి ఏ వార్డుకు చెందిన ఏజెంట్లు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి తలెత్తడంతో విషయాన్ని తెలుసుకున్న అధికారులు జరిగిన పొరపాటును సరిదిద్దేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. దీంతో రెండుగంటలకు పైగా ఆలస్యంగా ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాల్సి వచ్చింది. అప్పటి వరకు అటు అభ్యర్థులలోనూ, ఇటు అధికారులు, మీడియా ప్రతినిధుల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠం నెలకొంది.
13వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కై వసం
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి 13వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. ఇక్కడ కూటమి అభ్యర్థిని కావ్యపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని కామాక్షి 87 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అర్ధరాత్రి వరకు సాగిన కౌంటింగ్‌లో తొలుత కామాక్షికి ఆధిక్యం రాగా ప్రత్యర్థి పార్టీ వారు రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. రీకౌంటింగ్‌లో సైతం కామాక్షికి ఆధిక్యం రావడంతో ఆమె గెలుపొందినట్లు అధికారులు డిక్లరేషన్ పత్రాన్ని అందించారు.


