● వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను గందరగోళానికి గురిచేసిన అధికారులు
నెల్లూరు(బారకాసు): నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మంగళవారం జరిగిన ఓట్లు లెక్కింపులో పారదర్శకత లోపించింది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ఓట్లు లెక్కింపు జరగడంపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతి బ్యాలెట్‌ను ఏజెంట్లకు చూపించి అంగీకరించిన అనంతరమే వాటిని లెక్కింపు చేయాలి. కానీ అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరించినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం టేబుల్‌కు నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నుంచి ఇద్దరు.. ముగ్గురిని, ప్రతిపక్షపార్టీల నుంచి ఒక్కరిని ఏజెంట్లుగా అనుమతించారు. లెక్కింపు సమయంలో కౌంటింగ్ సిబ్బంది నలుగురు ఒకేసారి బ్యాలెట్ పేపర్లను ఏజెంట్‌కు చూపిస్తూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను గందగోళానికి గురి చేసి ఏ బ్యాలెట్ పేపర్‌లో ఏ పార్టీకి ఓటు వేశారనే విషయాన్ని పరిశీలించేందుకు సమయం ఇవ్వకుండానే ఇది సైకిల్ గుర్తుకు పడిన ఓటు అంటూ కూటమి ఖాతాలో వేసినట్లు చెబుతున్నారు. ఏజెంట్ మరలా ఒకసారి చూపించండని అడిగేలోపు మరో బ్యాలెట్ పేపర్‌ను చూపించడం చేశారు. ఇలా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను గందరగోళానికి గురి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అధికారులు కూడా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఏమైనా అభ్యంతరాలు చెబితే వాటిని ఎవరూ పట్టించుకోకండీ.. మీ పని మీరు కొనసాగించండంటూ ఆదేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత వరకు అత్యధిక బ్యాలెట్స్ టీడీపీ ఖాతాల్లో వేసి కట్టలు కట్టి లెక్కించి అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారని నిర్ధారించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ తమ గెలుపు కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో ఉంచుకుని చేయని ప్రయత్నమంటూ లేదు.
పోలింగ్ జరగనున్న
పాఠశాలలకు సెలవు నేడు
నెల్లూరు (టౌన్): జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌ను నిర్వహించనున్న పాఠశాలలకే సెలవు బుధవారం ఉంటుందని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతారామపురం మండలం మినహా జిల్లాలోని అన్ని రూరల్ ప్రాంతాల్లో గల స్కూళ్లకు సెలవును గురువారం ప్రకటించామని వివరించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి బుధ, గురువారాల్లో ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. నెల్లూరు నగరం, గూడూరు, ఆత్మకూరు, కావలి, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాల్టీలు, అల్లూరు నగర పంచాయితీ పరిధిలోని స్కూళ్లలో తరగతులను యథావిధిగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయమై ఎంఈఓలు తగు చర్యలు చేపట్టాలని కోరారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్
● వ్యక్తి దుర్మరణం
కలిగిరి: ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొమ్మరాజుచెరువు సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కొండాపురం మండలం గొట్టిగుండాలకు చెందిన బ్రహ్మ య్య (42).. కలిగిరిలో నివాసముంటూ కా ర్పెంటర్‌గా పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గొట్టిగుండాల నుంచి కలిగిరికి బైక్‌పై వస్తూ.. జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. కాగా మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటన స్థలానికి కలిగిరి పోలీసులు చేరుకొని వివరాలను సేకరించారు.
డీసీపల్లిలో 441 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం 441 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 552 బేళ్లు రాగా, 441 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. వేలంలో కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.90, సగటున రూ.147.34 ధర పలికిందని వివరించారు. వేలంలో 11 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.


