● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): మురసు తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. తుఫాన్ వల్ల జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. తుఫాన్ కావలి – కందుకూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టామన్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. కావలి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తుఫాన్ వల్ల ఇబ్బందులు పడే ప్రజల తక్షణ సాయం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇది 24 గంటలు పని చేస్తుందన్నారు. ప్రజలు తుఫాన్ ఇబ్బందులు తెలిపేందుకు 0861–2331261, 79955 76699 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.


