● నామినేషన్ల పర్వం మొదలుకొని
పోలీసులతో బెదిరింపులు
● అక్రమ కేసులు, అన్యాయంగా
నోటీసులు
● ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు
● స్థానిక ప్రజాప్రతినిధి అండతో
చెలరేగిన వైనం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఓటమి భయంతో కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు పోలీసులతో దాష్టీకాలను ప్రదర్శించారు. గూడూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం కొత్త తరహా ఎత్తుగడలేశారు. అక్రమంగా కేసులు నమోదు చేస్తూ.. అన్యాయంగా నోటీసులిస్తూ.. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేయించి.. నామినేషన్ కేంద్రాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రానీయకుండా అడ్డుకున్నారు. రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఎన్వోసీల కోసం స్టేషన్‌కెళ్తే.. అక్కడ వారిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఏరా.. ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారా.. అవసరమా.. కేసులు పెట్టి లోపలేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంతో వారు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారు. దీంతో పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
చేష్టలుడిగి చూస్తూ..
గూడూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ కేంద్రాలకు రాకుండా ఆంక్షలను పోలీసులు విధించారు. అయితే టీడీపీ నేతలు.. అభ్యర్థులతో గుంపులుగా కేంద్రాలకెళ్లి గంటల తరబడి అక్కడే ఉన్నా, వారిని అడ్డుకున్న దాఖలాల్లేవు. నామినేషన్ పత్రాలను పోలీసుల ఎదుటే చించేసి మహిళలపై దాడులు చేసినా, చేష్టలుడిగి చూశారు. చిల్లకూరు మండలంలో అభ్యర్థులను ఖాకీలు భయభ్రాంతులకు గురిచేశారు. నామినేషన్‌కు రాకుండా అడ్డుకోవడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకున్న ఎస్టీ మహిళా అభ్యర్థిని భయపెట్టడంతో ఆమె నామినేషన్ వేసేందుకు సైతం అందుబాటులో లేకుండాపోయారు.
లాఠీచార్జి
కోట మండలంలోని నామినేషన్ కేంద్రం వద్దకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మద్దతుదారులు చేరుకుంటున్నారని తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో వచ్చి ఏకంగా లాఠీచార్జి చేశారు. పరిశీలనలో తప్పులున్నాయని ఆర్వోలు ప్రకటించి.. టీడీపీకి పరోక్ష సహకారాన్ని అందించారు. వాకాడు మండలంలో తొలి రెండు రోజులు నామినేషన్ కేంద్రాల వద్దకు పార్టీ అభ్యర్థులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చివరి రోజు ఎలా ఒకలా చేరుకొని దాఖలు చేయగలిగారు. చిట్టమూరు మండలంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కేంద్రం వద్దకు పార్టీ మద్దతుదారులు భారీగా చేరుకునేందుకు యత్నించగా, ఖాకీలు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో ఉన్నతాధికారుల జోక్యంతో వారిని అనుమతించారు. ప్రజాప్రతినిధి అండదండలతో ఖాకీలు ఇలా వ్యవహరించారు.
అక్రమ అరెస్ట్‌లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఖాకీలు అక్రమంగా అరెస్ట్ చేశారు. వాకాడు మండలానికి చెందిన పార్టీ సీఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డిపై హత్యాయత్నం కేసు మోపారు. చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డిపై హత్యాయత్నం కేసును బనాయించి రిమాండ్‌కు పంపారు. గూడూరు మండలంలోని మంగళపూరుకు చెందిన సీనియర్ నేత ఎద్దల నరేంద్రరెడ్డి ఫామ్ హౌస్‌లో తనిఖీల పేరుతో అర్ధరాత్రి నానా యాగీ చేశారు.
ఖాకీలపై ఆగ్రహం..?
ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాని మండలాలకు సంబంధించిన ఎస్సైలపై స్థానిక ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. గూడూరు, చిట్టమూరు మండలాల్లో ఈ పరిస్థితి లేకపోవడంతో ఆయన రుసరుసలాడారని సమాచారం. మరోవైపు ఎన్నికలను సైతం సజావుగా సాగిస్తారాననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


