● ఫేక్ నామినేషన్లు.. తిరస్కరణలపై న్యాయపోరాటం
● చంద్రబాబు బెదిరింపులకు
భయపడేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు, దాడులు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. నకిలీ నామినేషన్లను వేయించడం.. బలమైన అభ్యర్థుల పత్రాలను తిరస్కరించడం.. ఉపసంహరించుకోవాలంటూ పోటీలో ఉన్నవారిని బెదిరించడం వంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు భయపడేదిలేదని, ఎలక్షన్ల అక్రమాలపై న్యాయం పోరాటం చేయనున్నామని ప్రకటించారు.
సుప్రీం కోర్టు ఆదేశాలనూ
పట్టించుకోవడంలేదు
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక.. ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రభుత్వం, ఓటమి భయంతోనే అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. న్యాయస్థాన ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల గడువును పొడిగించినా, ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు రాకుండా ఉండేందుకు గానూ తమ పార్టీ పేరుతో నకిలీ వాటిని దాఖలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. తద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని చూపేలా యత్నిస్తున్నారని విమర్శించారు.
రకరకాల కారణాలతో తిరస్కరణ
తమ పార్టీ తరఫున గెలిచే అవకాశమున్న అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. వృత్తి వివరాలు పేర్కొనలేదని.. భార్య ఆస్తుల వివరాలను వెల్లడించలేదని.. రికవరీలున్నాయని.. ఇలా పలు సాకులు చూపుతున్నారని చెప్పారు. వివాహం కాని వ్యక్తి.. భార్య ఆస్తుల వివరాలను ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు. తిరస్కరణపై అప్పీల్ చేసుకున్నా, వాటిని పరిశీలించి న్యాయం చేయకుండా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారని ధ్వజమెత్తారు. వీటికి గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయని సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆర్వోలు వ్యవహరించాలని కోరారు.
వెనుకడుగేసేదిలేదు
తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో పార్టీ శ్రేణులు ధైర్యంగా పోరాడుతున్నారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగేసేదిలేదని, ఎన్నికల్లో పోటీ చేసే.. ఓటేసే హక్కును కల్పించేంత వరకు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు
కేసుల పేరుతో తమ పార్టీ అభ్యర్థులను భయపెడుతూ.. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. గూడూరులో పార్టీ నేత యద్దల నరేందర్‌రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని, మరికొందరు నేతలపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలు అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులను దాఖలు చేస్తామని హెచ్చరించారు.


