● మైపాడు – 2 ఎంపీటీసీ స్థానానికి రూ.60 లక్షలు
● నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. విజయమే లక్ష్యంగా అధికార కూటమి నేతలు భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంపీటీసీ స్థానాలను దక్కించుకునేందుకు నగదును ఎరేస్తూ వేలానికి తెరలేపారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా ఇందుకూరుపేట మండలం మైపాడు – 2 ఎంపీటీసీ స్థానాన్ని ఏకంగా రూ.60 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరిందనే టాక్ నడుస్తోంది.
ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున..?
మైపాడు గ్రామ పరిధిలో తూర్పుపాళెం, పడమరపాళెం, కృష్ణాపురం మత్స్యకార గ్రామాలు మైపాడు – 2 ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ఉన్నాయి. ఈ మూడు గ్రామాలకు కలిపి రూ.60 లక్షలను వెచ్చించేలా ఒప్పందం కుదిరిందనే ప్రచారం నడుస్తోంది. ఈ ఎంపీటీసీ సెగ్మెంట్‌లో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని ఎంపీటీసీ స్థానాల్లోనూ ఇలానే సాగుతుండగా, ప్రలోభాలను కొందరు తిరస్కరించారని సమాచారం.


