పచ్చ నేతలకు
ఖాకీల రెడ్‌కార్పెట్
అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థులను వెంట తీసుకెళ్లి దగ్గరుండి నామినేషన్లు వేయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలకు మాత్రం పోలీసులు ఆంక్షలు విధించి అధికార పార్టీకి పోలీసులు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలు తమ అభ్యర్ధులతో కలిసి నామినేషన్ కేంద్రాలకు వెళుతుండగా ప్రతిపక్ష నాయకులను మాత్రం ఇళ్లకే పరిమితం చేయడం వివక్ష పూరిత చర్య అని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే అపహాస్యం చేస్తున్నారు.
సాక్షిప్రతినిధి నెల్లూరు: ఓటమి భయంతో మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియలో అరాచకాలు సృష్టించిన టీడీపీ మూకలు.. తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ అంతకు మించి బరితెగించారు. పచ్చమూకలు కర్రలు, రాడ్లతో నేరుగా నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చినా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నా.. పోలీసులు వారికి అండదండలు అందిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా.. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునే రీతిలో మహిళా అభ్యర్థులతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి చేతుల్లోనే నామినేషన్ల పత్రాలను లాక్కొని చించివేస్తే.. మరికొందరు వారి చీరలు లాగి చించేసిన దాష్టీకాలకు తెగించారు.
ఓటమి భయంతో అరాచకాలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ నెల 21న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలు, గూండాయిజానికి పాల్పడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచేందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతల స్వేచ్ఛను హరిస్తున్నారని పోలీసుల తీరును వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
పచ్చమూకలకు స్వేచ్ఛ..
వైఎస్సార్‌సీపీకి ఆంక్షలు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ మూకలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాకుండా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికి పెద్ద ఎత్తున నామినేషన్ కేంద్రాలకు సమీపంలో గుమికూడి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న టీడీపీ మూకలపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమైయ్యారన్న విమర్శలున్నాయి. చిల్లకూరు, చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరుల్లో టీడీపీ మూకల సాగించి గూండాయిజంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమన్వయకర్తల హౌస్ అరెస్ట్‌లు
మరో వైపు పోలీసులు అధికార పార్టీకి ఏరకంగా కొమ్ముకాస్తున్నారంటే.. ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్‌లతో కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పచ్చమూకలను మాత్రం యథేచ్చగా అచ్చొసిన ఆంబోతుల్లా రోడ్లపైకి వదిలేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభ్యర్థులకు అండగా నిలిచి నామినేషన్లు వేయించేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు గురువారం సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు పోలీసుల ద్వారా వారిని అడ్డుకున్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్‌లు చేశారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న కిరాయి మూకలు
నామినేషన్ కేంద్రాల వద్దకు
వెళ్లొదంటూ వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్తలకు పోలీసు నోటీసులు
మహిళా అభ్యర్థుల చీరలు, నామినేషన్లు చించేసినా.. కళ్లప్పగిస్తున్న పోలీసులు
టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకుంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై లాఠీచార్జి
అల్లరిమూకల బరితెగింపు


