నెల్లూరు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దౌర్జన్యకాండను టీడీపీ సాగిస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను హౌస్ అరెస్ట్‌లు చేసే కుట్రలకు తెరలేపారు. ఇందులో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకూడదంటూ ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయనకు నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమ పార్టీ నేతలను నిర్బంధిస్తూ అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి తగదన్నారు. ఎన్నికల్లో ఎదుర్కోలేకే ఇలాంటి పద్ధతులను టీడీపీ అవలంబిస్తోందని మండిపడ్డారు. అన్ని అంశాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
పోలీసుల మోహరింపు
కోవూరు: స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి నోటీసులను దర్గామిట్ట సీఐ అందజేశారు. ఆపై హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వెలుపల పోలీసులను మోహరించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలేదైనా పోటీ చేయాల్సిందే..!
ఆత్మకూరు: ఆత్మకూరులో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా గుర్తుకొచ్చే మొదటి పేరు రావులకొల్లు మాలకొండయ్యది. ఎలాంటి ఎలక్షనైనా నామినేషన్‌ను తప్పక దాఖలు చేస్తారు. పంచాయతీ, కౌన్సిల్, మున్సిపాల్టీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ప్రతి ఎన్నికల్లోనూ ముందుంటారు. ఆత్మకూరులోనే కాకుండా కడప, నంద్యాల పార్లమెంట్ ఉప ఎన్నికల్లో సైతం నామినేషన్ చేసిన ఘనత ఈయనది. అప్పట్లో 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని పీవీ నరసింహరావుపై, కడప పార్లమెంట్ స్థానానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రోజుల్లోనూ ఈయన నామినేషన్ వేశారు. అయితే స్థానిక పోలీసులు విత్‌డ్రా చేయించి ఆత్మకూరుకు పంపేశారు. ఓసారి నామినేషన్ దాఖలుకు డిపాజిట్ కట్టేందుకు నగదు లేకపోవడంతో పది మంది సాయమడిగి మరీ వేశానని కొండయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంత పొందుతున్న ఈయన 2014లో జరిగిన సాధారణ, 2022లో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో చివరిసారి పోటీ చేశారు. ఇలా మొత్తం 21సార్లు నామినేషన్ వేశానని చెప్పారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 73,226 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,750 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.2.66 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


