కృష్ణపట్నంలో కోస్ట్‌ గార్డ్‌ హోవర్‌ క్రాఫ్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నంలో కోస్ట్‌ గార్డ్‌ హోవర్‌ క్రాఫ్ట్‌

Oct 20 2026 4:37 AM | Updated on Oct 20 2026 4:37 AM

ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నం బీచ్‌కు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌కు చెందిన హోవర్‌ క్రాఫ్ట్‌ సోమవారం వచ్చింది. ప్రజలు, బీచ్‌కు వచ్చిన సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. సముద్రంపై వేగంగా ప్రయాణించే దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తి చూపారు.

జిల్లాలో మోస్తరు వర్షాలు

నెల్లూరు(అర్బన్‌): అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షా లు కురిశాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8.30లోపు అనంతసాగరం మండలంలో 32.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. అల్లూరులో 22.2, కలువాయిలో 18.2, మర్రిపాడులో 16.2, మనుబోలులో 12.2, కలిగిరిలో 11.2, ముత్తుకూరులో 11.2 మిల్లీమీటర్ల మేర నమోదైంది.

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

నెల్లూరు రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికలను జిల్లాలో పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు గానూ ఎలక్షన్ల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు. అమరావతిలోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ సోమవారం నిర్వహించారు. దీనికి హాజరైన అనంతరం కలెక్టరేట్లోని శంకరన్‌ హాల్లో ఎన్నికల నోడల్‌ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్‌, ఎస్పీ అజిత వేజెండ్ల, ఎలక్షన్‌ సాధారణ పరిశీలకురాలు సదా భార్గవి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించనున్న తరుణంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఉంచనున్నామని వివరించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్‌ బందోబస్తుతో పాటు అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలు, పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సామగ్రి తరలింపు, మైక్రో అబ్జర్వర్ల నియామకం, సిబ్బందికి శిక్షణ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.

కోడ్‌ ఉల్లంఘనలకు తావివ్వొద్దు

పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సదా భార్గవి సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపా రు. ఎన్నికల విధుల కోసం సుమారు నాలుగు వేల మంది పోలీస్‌ సిబ్బందిని వినియోగించేలా ప్రణాళికను రూపొందించామని వెల్లడించారు. డీ ఆర్వో విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

‘బోగస్‌ కులధ్రువీకరణతో

భానుశ్రీ కుమార్తె నామినేషన్‌’

నెల్లూరు(అర్బన్‌): మాజీ మేయర్‌ భానుశ్రీ కుమార్తె నందిమండలం వెంకటదివ్యశ్రీ బోగస్‌ కుల ధ్రువీకరణ పత్రంతో బీసీ – ఏ రిజర్వేషన్‌ కింద టీడీపీ తరఫున 56వ డివిజన్లో నామినేషన్‌ వేశారని అగ్నికుల క్షత్రియ సంఘ జిల్లా నేతలు ఆరోపించారు. నామినేషన్‌ను తిరస్కరించడంతో పాటు ఆమైపె చర్యలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్‌ సెల్‌కు ఫిర్యాదును సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చమ్మండి రాము, తిరువత్తూరు శివశంకర్‌ పంపారు. రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా వినతిపత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వెంకటదివ్యశ్రీ తల్లిదండ్రులు భానుశ్రీ, శివసుబ్బరాజు క్షత్రియ రాజులని, ఓసీ వర్గానికి చెందుతారన్నారు. అయితే అగ్నికుల క్షత్రియ పేరుతో బీసీ – ఏ సర్టిఫికెట్‌ను అక్రమంగా పొందారని, దీనిపై కోర్టులో కేసును వేయగా, అది విచారణలో ఉందని చెప్పారు. బీసీ మహిళకు కేటాయించిన డివిజన్లో నామినేషన్‌ను దాఖలు చేసి బీసీ రిజర్వేషన్లకు గండికొట్టారని ఆరోపించారు. నామినేషన్‌ను తిరస్కరించకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement