తమ్ముడు: అన్నా.. ఓ విషయం చెబుతా.. విన్నాక నువ్వే ఆశ్చర్యపోతావ్!
అన్న: ఏంట్రా తమ్ముడూ.. అంతలా ఉత్కంఠ పెంచుతున్నావ్.. అసలేం జరిగిందో చెప్పు!
తమ్ముడు: మన జలదంకి ఎంపీపీ పదవికి రూ.2 కోట్ల డీల్ కుదిరిందంటన్నా!
అన్న: ఏంటీ.. రూ.2 కోట్లా.. ఎంపీపీ పదవికి..!
తమ్ముడు: అదే కదన్నా.. నాకూ అర్థం కావడం లేదు. ఆదివారం వింజమూరులోని ఎమ్మెల్యే తన కార్యాలయంలో మన జలదంకి నాయకులతో సమావేశం పెట్టారంట. ఎంపీపీ పదవి కావాలంటే ఎవరు ఎంత పెట్టగలరో తేల్చుకోవాలని బేరం పెట్టారంట!
అన్న: అయ్యో.. ఇదేం రాజకీయం రా బాబూ! పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు పదవులు ఇవ్వడం మానేసి.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తారో వాళ్లకే కుర్చీనా? మరి మన పెద్దాయన సంగతేంటి? పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడో!
తమ్ముడు: తెలుసన్నా.. ఆయన తన వల్ల అయినంతలో రూ.50 లక్షలు ఇస్తానని చెప్పాడంట. కానీ.. మొన్నటి ఎన్ని కల సమ యంలో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఓ నాయకుడు మాత్రం ఏకంగా రూ.2 కోట్లు ఇస్తానని చెప్పేశాడంట!
అన్న: అబ్బో.. అంటే పార్టీ కోసం పాతికేళ్లు పనిచేసినా ఓ లెక్క.. ఎన్నికల ముందు పార్టీ మారి కోట్లు కుమ్మరిస్తానంటే మరో లెక్కన్నమాట!
తమ్ముడు: అదే కదన్నా! ఆ రూ.2 కోట్ల మాట వినగానే సమావేశంలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నివ్వెరపోయారంట. మన పెద్దాయనకేమో అంత పెట్టే స్తోమత లేదు. ‘ఇక నా వల్ల కాదులే బాబూ.. ఈ పోటీలో నేను గెలవలేను’ అనుకున్నాడో ఏమో.. పంచె సర్దుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడంట!
అన్న: మరి ఆయన ఇన్నాళ్లూ పార్టీ కోసం చేసిన సేవలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా తమ్ముడూ!
తమ్ముడు: మరేం చేస్తాం అన్నా! ఎన్నికలొస్తే మనలాంటి కార్యకర్తలు జెండాలు మోయాలి.. గోడలకు పోస్టర్లు అంటించాలి.. ప్రచారంలో గొంతులు చించుకోవాలి.. నాయకుల కోసం నిద్రాహారాలు మానుకోవాలి. తీరా పదవుల దగ్గరకు వచ్చే సరికి జేబులో ఎంత డబ్బుంది.. ఎంత పెట్టగలవు.. అడుగుతున్నారు!
అన్న: ఛీ.. ఛీ.. ఇదేం ఖర్మరా బాబూ! పార్టీకి విధేయతతో పనిచేసినోళ్లకు నిరీక్షణ.. డబ్బున్నోళ్లకు ఆహ్వానం. కార్యకర్తలకు హామీలు.. పదవులు ఆశించే వాళ్లకు వేలాలు! ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలా.. లేక పదవుల కోసం వేలంపాట నిర్వహించాలా?
తమ్ముడు: సరే అన్నా.. ఈ రాజకీయాలు మనకెందుకు గానీ! నేను కావలి దాకా వెళ్లాలి. ఉంటా మరి! – కావలి
గుసగుసలు


