● గర్భిణులు, దివ్యాంగ ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీలు ● కలెక్టరేట్‌కు జాబితా పంపిన విద్యాశాఖ
● మినహాయించాలని బాధితుల విజ్ఞప్తి
నెల్లూరు(అర్బన్): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని టీచర్లు ఆరోపిస్తున్నారు. గర్భిణులు, దివ్యాంగులు, ప్రమాదాల్లో గాయపడి నడవలేని స్థితిలో ఉన్నవారికి సైతం ఎన్నికల విధులు కేటాయించారు. ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా విధులు కేటాయించడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. విద్యాశాఖ తమ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలతోపాటు, విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నవారి సమాచారాన్ని కూడా కలెక్టరేట్‌కు పంపింది. సంబంధిత అధికారులు ఆ వివరాలను పరిశీలించకుండానే విధులు కేటాయించారు. దీంతో కొందరు గర్భిణులు, నడవలేని స్థితిలో ఉన్న టీచర్లు తమ సమస్యలను డీఆర్వోకు చెప్పుకొంటున్నారు. అక్కడ కొందరికి మినహాయింపు ఇస్తుండగా, మరికొందరిని ఎన్నికల విధుల శిక్షణ, సిబ్బంది పంపిణీ కేంద్రాల్లో తమ సమస్యలు చెప్పుకోవాలని సూచిస్తున్నారు. చెందోడు గ్రామానికి చెందిన ఓ స్కూల్ అసిస్టెంట్ ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. కాలికి శస్త్రచికిత్స జరగడంతో ప్రస్తుతం చేతికర్ర సాయంతో నడుస్తూ కోలుకుంటున్నాడు. అయినప్పటికీ ఆయనకు ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ)గా ఎన్నికల విధులు కేటాయించారు. ప్రమాదానికి గురైన విషయాన్ని విద్యాశాఖ అధికారులు పంపిన జాబితాలోని రిమార్కుల్లో పేర్కొన్నప్పటికీ విధులు కేటాయించారు. కలెక్టర్ జోక్యం చేసుకుని విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.


