భగత్‌సింగ్‌ కాలనీలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

భగత్‌సింగ్‌ కాలనీలో ఉద్రిక్తత

Oct 20 2026 4:37 AM | Updated on Oct 20 2026 4:37 AM

● 72వ డివిజన్‌ వైఎస్సార్సీపీ అభ్యర్థి సఫియా బేగం నామినేషన్‌ తిరస్కరణ

● పార్టీ శ్రేణుల ఆందోళన..

పోలీస్‌ బలగాల మోహరింపు

● అధికారుల చర్యలపై మండిపడిన పర్వతరెడ్డి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): నగరంలోని భగత్‌సింగ్‌కాలనీలో గల వార్డు సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి సోమవారం నెలకొంది. 72వ డివిజన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సఫియా బేగం నామినేషన్‌ను తిరస్కరిస్తున్నామని అధికారులు తెలియజేశారు. అన్ని పత్రాలను సక్రమంగా సమర్పించినా, ఇలా ఎందుకు చేస్తున్నారని అభ్యర్థితో పాటు నేతలు ప్రశ్నించారు. భగత్‌సింగ్‌కాలనీలోని టిడ్కో సముదాయంలో కమ్యూనిటీ భవనానికి సంబంధించిన బకాయిలున్నాయని, దీంతో తిరస్కరించామని చెప్పారు. ఈ భవనానికి సంబంధించి తమకెలాంటి లిఖితపూర్వక ఒప్పందం లేదని, ఈ క్రమంలో తామెందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని సఫియాబేగం, ఆమె భర్త ముజీర్‌ ప్రశ్నించారు. బకాయిలపై కమిషనర్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తిరస్కరిస్తున్నామని ఆఫీసర్లు చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రాధేయపడినా, తామేమీ చేయలేమని చెప్పడంతో సచివాలయం వద్దకు చేరుకున్న పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. దీంతో ఏఎస్పీ దీక్ష చేరుకొని పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నేత రాధామాధవి చేరుకొని ఎన్నికల అధికారులను నిలదీశారు. కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి కమిషనర్‌ సంతకంతో నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ను ఇచ్చారని, అయితే బకాయిలున్నాయనే నెపంతో నామినేషన్‌ను ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి, ఇదే అంశాలను ప్రస్తావించగా, అంతా ఎన్నికల అధికారులు చూసుకుంటారంటూ బదులిచ్చారు.

అత్యంత దారుణంగా..

నెల్లూరు నగర ఎమ్మెల్యేగా నారాయణ గెలుపొందిన నాటి నుంచి సింహపురిలో పరిస్థితులు దారుణంగా మారాయని చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని అరాచకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. కమ్యూనిటీ భవనాన్ని సఫియాబేగానికి ఇవ్వడంపై ఎలాంటి ఆధారాల్లేవని, ఈ క్రమంలో బకాయిలెలా ఉంటాయని ప్రశ్నించారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చారనే కారణంతో కక్షగట్టి ఇలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. కలెక్టర్‌కు ఫోన్‌ చేస్తే కమిషనర్‌ను అడగాలన్నారని, ఆయనకు ఫోన్‌ చేస్తే ఆర్వోతో మాట్లాడాలంటున్నారని తెలిపారు. కమిషనర్‌ చెప్పడంతోనే నామినేషన్‌ను తిరస్కరించి ఆర్వో వెళ్లిపోయారన్నారు. అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ నగరంలో తమ పార్టీ అభ్యర్థులు చెప్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నాం.. ఏమి చేసినా సరిపోతుందనే యోచన తగదని.. రానున్న రోజుల్లో తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ డివిజన్లో తమ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థి నామినేషన్‌ వేశారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement