● పేకాట క్లబ్ నిర్వాహకుడి దారుణం
● భార్యాభర్తల మధ్య వివాదంలో జోక్యం
కావలి: భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తానంటూ మధ్యవర్తిత్వానికి పిలిచి.. చివరకు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం మద్దూరుపాడులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మద్దూరుపాడులో నివాసముంటున్న బొమ్మిరెడ్డి శ్రీనివాసులు, అతని భార్య శేషమ్మ మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే అదే గ్రామంలో పేకాట క్లబ్ నిర్వహిస్తున్న కొండేటి సుబ్రహ్మణ్యం ఇటీవల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని.. రాజీ కుదురుస్తానని చెప్పినట్లు బాధితుడు ఆరోపించాడు. రాజీ కుదరకపోగా.. విభేదాలు మరింత పెరిగాయని చెబుతున్నాడు. ఈ క్రమంలో మరోసారి రాజీ చేస్తానంటూ సుబ్రహ్మణ్యం మంగళవారం తనను పిలిచాడని, ఏదో ఒక పరిష్కారం లభిస్తుందేమోనని భావించి మద్దూరుపాడుకు వెళ్లానని శ్రీనివాసులు తెలిపాడు. అయితే సుబ్రహ్మణ్యం వాదనకు దిగి.. ఉన్నట్టుండి కత్తితో దాడి చేసినట్లు ఆరోపించాడు. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అసలు వివాదానికి కారణాలేంటి?, కత్తితో దాడి చేసే పరిస్థితి ఎందుకొచ్చింది?, దాడి వెనుక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడికి న్యాయం చేయడంతోపాటు దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


