నెల్లూరు(పొగతోట): సమాజంలో ప్రజా సమస్యలను గుర్తించి వాటిని కథనాల రూపంలో ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లే వారే జర్నలిస్టులని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. తాను జిల్లాకు వచ్చి ఏడాది దాటిందన్నారు. నా దృష్టికి రాని అనేక సమస్యలను పత్రికల ద్వారా చూసి తెలుసుకున్నానన్నారు. ప్రస్తుతం సమాజంలో అనేక మార్పులు జరుగుతున్నాయని, దీనిపై జర్నలిస్టులకు నిరంతర శిక్షణ, మార్గదర్శకత్వం అవసరమన్నారు. ఈ మధ్యకాలంలో పత్రికల్లో వచ్చిన కథనాల ద్వారా వినియోగంలోకిరాని ప్రభుత్వ ఆస్తులు, క్రీడా సదుపాయాల అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు. వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామీణ విలేకరుల వ్యవస్థ ఉందన్నారు. ఈ క్రమంలో వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. సమాచార శాఖ డీడీ వేణుగోపాల్‌రెడ్డి, సీఆర్ మీడియా అకాడమీ ఓఎస్డీ జీవన్ పాల్గొన్నారు.


