నెల్లూరు(అర్బన్): హెచ్‌ఐవీ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ సుజాత అన్నారు. నగరంలోని బీవీనగర్ డీఎఫ్‌ఐటీ కార్యాలయం నందు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ జబ్బులపై సమీక్షా సమావేశం శనివారం జరిగింది. జిల్లాలో హెచ్‌ఐవీ నిర్మూలనకు జరుగుతున్న ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఎయిడ్స్, టీబీ, లెప్రసీ నియంత్రణాధికారి డాక్టర్ ఖాదర్‌వలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐసీటీసీ కౌన్సిలర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
● నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ సుజాత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. లోపాలున్న చిన్న పిల్లలకు అందిస్తున్న సేవలపై ఆరాతీశారు. చిన్నపిల్లల డాక్టర్ సురేష్, ఇతర డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


