తోటపల్లిగూడూరు (పొదలకూరు) : రాష్ట్రంలో ఫీడ్ ధరలను కంపెనీలు ఇష్టానుసారం పెంచుతున్నా.. కూటమి ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనలో ఆక్వా రైతులు కుదేలై పోయారని విచారం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలతో కుమ్మకై ్క దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. తోటపల్లిగూడూరు మండలం పాపిరెడ్డిపాళెం గ్రామంలో కాకాణి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్నెళ్లల్లో మూడు దఫాలుగా ధరలు పెంచుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 40 రోజుల క్రితమే ధరలు పెంచిన ఆక్వా ఫీడ్ కంపెనీలు వెంటనే మరోసారి కిలో రూ.17 నుంచి రూ.22లకు పెంచారన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆక్వా సాగుకు హాలిడే ప్రకటించాల్సి వస్తుందన్నారు. ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం లాలూచీ పడి డ్రామాలకు తెర లేపిందని, ఆక్వా రైతుల నడ్డి విరిచేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నట్టు ఆరోపించారు. తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలను ముంచుతున్న పాలకులు జిల్లా చీఫ్ ఇంజినీర్ల కంటే నాయకులు అంతా తమకు తెలిసినట్టు ఎక్కువగా మాట్లాడుతున్నట్టు ధ్వజమెత్తారు.
సాగునీటి విడుదల అస్తవ్యస్తం
రెండో పంటకు ప్రణాళికాబద్ధంగా కాకుండా నీరు విడుదల చేసి ప్రస్తుత జలాశయాలను ఖాళీ చేశారని కాకాణి విమర్శించారు. 600 ఎకరాల ఆయకట్టు ఉన్న గ్రామంలో కేవలం 30 నుంచి 40 ఎకరాల అవసరాల కోసం నీటిని విడుదల చేసి మిగిలిన 500 ఎకరాల సరిపడా నీటిని వృథా చేసినట్లు ఆరోపించారు. తొలి పంటపై అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రస్తుతం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మొదటి పంటకు నీరు అందజేసేందుకు వీల్లేకుండా ఉందన్నారు. ముందస్తు ఆలోచన, ప్రణాళికలు లేకపోవడం వల్లనే జిల్లాలో సాగు, తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తెలిపారు. వాతావరణం అనుకూలించకున్నా, కృష్ణా నదికి నీళ్లు వచ్చాయని, నారాయణ్‌పూర్, జూరాల నిండి, శ్రీశైలం ప్రాజెక్ట్‌కు నీరు చేరినట్టు కాకాణి వెల్లడించారు. మళ్లీ వరదలు రావొచ్చు, రాకపోవచ్చునన్నారు. సోమశిలకు శ్రీశైలం నీటిని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఈ రోజుకు కూడా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అవకాశం ఉందని, అయితే నీళ్లు తరలించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నట్లు విమర్శించారు. 17 టీఎంసీలు సోమశిల, 18 టీఎంసీలు కండలేరు జలాశయాల్లో అతి తక్కువ నీటి నిల్వలు ఉన్నాయని, డెడ్ స్టోరేజీ తీసివేస్తే 10 టీఎంసీలు ఉంటాయని ప్రస్తుత పంటకు మరో 3 నుంచి 4 టీఎంసీలు అవసరం అవుతాయన్నారు. ఈ నెల 8వ తేదీన రైతులతో కలిసి బ్యారేజీలు బావురుమంటున్నాయని శ్రీశైలం నుంచి వెంటనే నీటిని విడు దల చేయాలని ధర్నాను తలపెట్టినట్టు స్పష్టం చేశారు. ఇటీవల మృతి చెందిన పార్టీ సానుభూతి పరులు కోటమ్మ, శ్రీరాములు, వర్షిత్ కుటుంబ సభ్యులను కాకాణి పరామర్శించారు. కాకాణి వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కంపెనీలను కట్టడి చేయని అసమర్థ కూటమి సర్కారు
ఆరు నెలల్లో మూడుసార్లు ధరల పెంపు
40 రోజుల్లోనే మరో సారి..
సాగునీటి విడుదల అస్తవ్యస్తం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


