సీఎం యోగి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు రాక రేపు | - | Sakshi
Sakshi News home page

సీఎం యోగి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు రాక రేపు

Sep 6 2026 12:13 AM | Updated on Sep 6 2026 12:13 AM

వెంకటాచలం: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సోమవారం వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌కు రానున్నారని ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఐ.దీపావెంకట్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వెంకటాచలం చేరుకుని, 11.30 గంటలకు సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయం ప్రాంగణంలోని సోమా నైపుణ్య కేంద్రాన్ని సందర్శిస్తారని తెలిపారు. 12 గంటలకు అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటిస్తారన్నారు. అనంతరం 2 గంటలకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చేరుకుని ట్రస్ట్‌ రజతోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొంటారని తెలిపారు.

జిల్లా పరిషత్‌ విభజన

ప్రక్రియ పూర్తి

నెల్లూరు (పొగతోట): రాష్ట్రంలో పాత 13 జెడ్పీలను రద్దు చేసి వాటి స్థానంలో 28 జిల్లా పరిషత్‌లను పునర్వ్యవస్థీకరిస్తూ పీఆర్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రాష్ట్ర అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా పరిషత్‌లో 46 మండలాలు ఉన్నాయి. నూతనంగా 35 మండలాలతో జిల్లా పరిషత్‌ ఉంటుంది. మిగిలిన 11 మండలాలు తిరుపతి జిల్లా పరిషత్‌లో విలీనం ఆయ్యాయి. జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది.

ఈ నెల 15 వరకే

సాగునీటి విడుదల

ఇరిగేషన్‌ ఈఈ ఆనంద్‌బాబు

సంగం: కనిగిరి రిజర్వాయర్‌, కనుపూరు కెనాల్‌తోపాటు డెల్టా పరిధిలో సాగునీటిని ఈ నెల 15వ తేదీ వరకు విడుదల చేస్తామని ఇరిగేషన్‌ ఈఈ ఆనంద్‌బాబు తెలిపారు. సంగం బ్యారేజీ వద్ద శనివారం నీటిమట్టం, లభ్యత, విడుదల ప్రక్రియను పరిశీలించారు. ఆయకట్టు రైతులకు సాగునీటి కొరత లేకుండా, నీటి వృథా కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఈఈ తెలిపారు. సాగునీటి పంపిణీని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు సంబంధిత ఏఈలు, డీఈలకు తగిన సూచనలు జారీ చేశామన్నారు. ఒక్క ఎకరా పంట కూడా నీరు లేక ఎండిపోకుండా, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ పంటలను కాపాడుతామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతలో లాసెస్‌ అధికంగా ఏర్పడినట్లు గుర్తించామని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తున్నట్లు చెప్పారు. పంటలను కాపాడేందుకు అదనపు నీటి విడుదలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ మండల కన్వీనర్‌పై

కేసు నమోదు

రెండు గ్రూపులుగా చీలిన తమ్ముళ్లు

వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల టీడీపీ కన్వీనర్‌ గూడ నర్సారెడ్డితోపాటు మరో పది మంది ఆయన ముఖ్య అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వింజమూరు బీసీ కాలనీకి చెందిన షేక్‌ ఖాదర్‌ బాషా మండల కన్వీనర్‌కు వ్యతిరేకంగా పలు అక్రమాలకు పాల్పడుతున్నా డంటూ గత నెల 27న సోషల్‌ మీడియాలో వాయిస్‌ మెసేజ్‌ పెట్టారు. దీంతో అదే రోజు రాత్రి తనపై మండల కన్వీనర్‌ వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదులో జాప్యం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై మరో వర్గం ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో మండల టీడీపీలో రెండు వర్గాలు ఎమ్మెల్యేతో పంచాయితీ పెట్టడంతో టీడీపీలో ఉన్న వర్గ విబేధాలు బహిర్గతమయ్యాయి. ఇరువర్గాలను సర్దుబాటు చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆ పార్టీ నేతలే చర్చించుకోవడం విశేషం. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ మండల కన్వీనర్‌ నర్సారెడ్డి, ఆయన ముఖ్య అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,374 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,241 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement