మెప్మా రుణ మోసాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

మెప్మా రుణ మోసాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Sep 6 2026 12:13 AM | Updated on Sep 6 2026 12:13 AM

కోవూరు: మెప్మా పేరుతో పేద ప్రజలకు రు ణాల పేరుతో జరుగుతున్న మోసాల ఫిర్యా దులపై కలెక్టర్‌కు నివేదించి తగిన చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. దళిత, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఎవరైనా రుణాల పేరుతో మోసాలకు పాల్పడితే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మెప్మా పేరుతో జరిగే అక్రమ రుణ వ్యవహారాలపై ప్రజలను అప్రమత్తం చేస్తామని చెప్పారు. ‘మెప్మా రుణ మాఫియా’ శీర్షికతో శనివారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనం నేపథ్యంలో డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి స్పందించారు. కోవూరు మండలంలోని సంఘమిత్ర కార్యాలయంలో శనివారం సంఘమిత్ర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మెప్మా పేరుతో రుణాల వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలను ఉల్లంఘించకూడదని ఆదేశించారు. ప్రతి పొదుపు సంఘ సభ్యురాలికి ప్రత్యేక ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నంబర్‌ ఉంటుందని, ఆ నంబర్‌ ఆధారంగానే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు కావాల్సి ఉంటుందని తెలిపారు. రుణాల మంజూరులో ఆన్‌లైన్‌ ప్రక్రియ, సభ్యుల థంబ్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం నంబర్‌, అవసరమైన ధ్రువీకరణలు లేకుండా రుణాలు మంజూరైతే సంబంధిత బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ప్రక్రియ లేకుండానే లక్షల రూపాయల రుణాలు మంజూరవుతున్నట్లు ఫిర్యాదు లు వస్తున్నాయని, అలాంటి రుణాలు ఏ విధంగా మంజూరయ్యాయన్న దానిపై సంబంధిత బ్యాంకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.

మెప్మా పేరుతో మోసాలను అడ్డుకోవాలి

నెల్లూరు నగరంలోని మెప్మా కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని రుణాల పేరుతో పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై కూడా అధికారులు దృష్టి సారించాలని నాగరాజకుమారి సూచించారు. మెప్మా లేదా ప్రభుత్వ పథకాల పేరుతో రుణాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగినా, అనుమానాస్పద పద్ధతుల్లో పత్రాలపై సంతకాలు తీసుకున్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అవసరమైతే దళిత, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి, రుణాల మంజూరు ప్రక్రియపై ప్రజలకు వివరించాలని సిబ్బందిని ఆదేశించారు.

దళిత, గిరిజన ప్రాంతాల ప్రజల్లో అవగాహన కల్పిస్తాం

ఇటువంటి వ్యవహారాలపై సంఘమిత్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement