దొంగే.. దొంగా.. దొంగా అని అరిచిన తరహాలో మారింది జిల్లాలోని నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగుల పరిస్థితి. ఉపాధి పనుల్లో అడుగడుగునా అవినీతి విలయతాండవం చేస్తుందనే అపవాదు ఉంది. దీన్ని నిజం చేస్తూ వర్కులు చేయకుండానే బిల్లులు చెల్లించడం.. ఐదుగురు కూలీలు పనిచేస్తే పది మందికి మస్లర్లేసి డబ్బులు కాజేసిన ఉదంతాలు వెలుగు చూశాయి. ఇదే తరహాలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ స్కీమ్ నిధులతో చేపట్టిన ప్రహరీల్లో చోటుచేసుకున్న అవినీతి బాగోతాలు ఇటీవలి కాలంలో బట్టబయలయ్యాయి.
నెల్లూరు(టౌన్): జిల్లాలో డ్వామా పనితీరు.. అంతా డ్రామాగా మారింది. ఆ శాఖలో వెలుగుచూస్తున్న అవినీతి పర్వాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి 2018 – 23 మధ్యలో ఉపాధి నిధులతో జిల్లాలోని 389 పాఠశాలల్లో ప్రహరీలను దశలవారీగా చేపట్టారు. కలెక్టర్ అనుమతితో నిర్మాణ బాధ్యతలను సమగ్రశిక్ష, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఏపీడబ్ల్యూఐడీసీ శాఖల్లోని ఇంజినీరింగ్ విభాగాలకు అప్పగించారు. అయితే ఇక్కడే భారీ అవినీతి జరిగింది.
బిల్లులు.. పదేపదే చెల్లింపు
కొన్ని పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులను రెండు సార్లు చెల్లించారు. మరికొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న పనుల్లో కొంత మేరే ఇవ్వాల్సి ఉన్నా, అవేవీ పట్టించుకోకుండానే మొత్తం చెల్లించిన విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంలో జరిగిన అవినీతి బాగోతాలు మీడియాలో రావడంతో వాటిని సరిదిద్దుకునే యత్నాల్లో డ్వామా అధికారులున్నారని తెలిసింది.
ఇదీ తంతు..
2018లో అప్పటి టీడీపీ హయాంలో ఉపాధి నిధులతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాలను చేపట్టారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక నాడు – నేడు మొదటి దశలో భాగంగా మరికొన్ని పాఠశాలల్లో నిర్మించారు. అప్పటి కలెక్టర్ల అనుమతితో బాధ్యతలను ఆయా శాఖల ఇంజినీరింగ్ విభాగంలోని సైట్ ఇంజినీర్లకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని 16 మండలాల పరిధిలో ఎంపిక చేసిన సుమారు 115 పాఠశాలల నిర్మాణ బాధ్యతలను కేటాయించారు. మిగిలిన మండలాల్లోని స్కూళ్లను పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఏపీడబ్ల్యూఐడీసీలోని సైట్ ఇంజినీర్లకు అప్పగించారు. ఇలా మొత్తం 389 స్కూళ్లలో ప్రహరీల నిర్మాణాన్ని చేపట్టారు. పాఠశాల విస్తీర్ణాన్ని బట్టి ప్రహరీకి రూ.ఐదు లక్షల నుంచి రూ.12 లక్షల్లోపు ఖర్చవుతుందని ఆయా శాఖ ఇంజినీర్లు చెప్తున్నారు. జిల్లాలో ఇంకేమైనా నాలుగైదు స్కూళ్లుంటే వాటికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అవుతుంది.
ఇవీ ఉదాహరణలు..
లొసుగులతో..
ఉపాధి పనుల బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ సంస్థ గతంలో నిర్వహించేది. అయితే దీన్ని తొలగించి ఎన్‌ఐసీని తీసుకొచ్చారు. అయితే టీసీఎస్ ఉన్న సమయంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ జీరో అని చూపింది. దీన్ని ఆసరాగా చేసుకొని పెండింగ్ పనులకు సైతం మొత్తం బిల్లులిచ్చారని తెలుస్తోంది.
విజిలెన్స్.. సోషల్ ఆడిట్
నిధుల దుర్వినియోగ విషయం వెలుగులోకి రావడంతో విజిలెన్స్ విచారణకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ప్రస్తుతం ఇది జరుగుతోంది. మరోవైపు సోషల్ ఆడిట్‌ను నిర్వహించి సమగ్ర నివేదికను అందజేయాలని డ్వామా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. దీంతో శంఖవరం, నల్లగొండ్ల పాఠశాలల్లో ప్రహరీలకు రెండోసారి తీసుకున్న బిల్లుల నగదును తిరిగి డ్వామా శాఖకు చెల్లించారని తెలిసింది. ఇదే దారిలో నందిపాడు, ఏపీ మోడల్ స్కూళ్ల కాంట్రాక్టర్ ఉన్నారని సమాచారం. మొత్తమ్మీద రూ.ఐదు కోట్లకుపైగా నిధులు స్వాహా అయ్యాయని తెలుస్తోంది. డ్వామాలోని కింది స్థాయి నుంచి ఉన్నతాధికారులు, ఆయా శాఖల ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన సైట్ ఇంజినీర్లు వాటాలు పంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయమై సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్యను సంప్రదించగా, విజిలెన్స్ అందించే నివేదిక ఆధారంగా చర్యలను కలెక్టర్ చేపట్టనున్నారని, ఎంకై ్వరీ జరుగుతున్న సమయంలో తానేమీ మాట్లాడకూడదని బదులిచ్చారు.
ఉపాధి నిధులతో
జిల్లాలోని 389 పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలు
సమగ్రశిక్ష, ఆర్‌డబ్ల్యూఎస్,
పంచాయతీరాజ్, ఏపీడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ విభాగాలకు బాధ్యతలు
భారీగా నిధుల దుర్వినియోగం
కింది స్థాయి నుంచి
ఉన్నతాధికారుల వరకు చేతివాటం
రూ.ఐదు కోట్లకుపైగా అవినీతి
వాస్తవాలు వెలుగులోకి రావడంతో సరిదిద్దుకునే యత్నం
పర్యవేక్షణ మొత్తం వారిదే..
ఉపాధి నిధులతో నిర్మాణాలు జరుగుతుండటంతో పర్యవేక్షణ మొదలుకొని బిల్లులు చెల్లించేంత వరకు డ్వామా అధికారులే బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. తొలుత ఎస్టిమేషన్, ఇసుక, ఇటుక, సిమెంట్, మెటీరియల్ తదితర ఖర్చుల వివరాలను ఎంబుక్‌లో ఆయా శాఖ సైట్ ఇంజినీర్ పొందుపరుస్తారు. అనంతరం దీన్ని ఆయా మండలంలో ఉండే డ్వామా ఏపీఓకు అందజేస్తారు. ఆపై వివరాలను స్కాన్ చేసి కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా అప్‌లోడ్ చేయిస్తారు. పాఠశాలకు డ్వామా ఫీల్డ్ అసిస్టెంట్ వెళ్లి ప్రహరీని జియోట్యాగ్ ద్వారా ఫొటో తీసి వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంది. వీటన్నింటినీ పరిశీలించాక బయోమెట్రిక్ వేసి బిల్లుల చెల్లింపునకు ఎంపీడీఓ గ్రీన్ సిగ్నలిస్తారు. ఇవన్నీ జరిగాకే సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులను చెల్లించాల్సి ఉంది.
నెల్లూరు (పొగతోట): పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలను అందజేయడంలో సమగ్ర శిక్ష అధికారులు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన స్టేట్ రిసోర్స్ పర్సన్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. వర్కులకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్ర శిక్షకు సంబంధించిన మండలాధికారులు చేపట్టారు. ఉపాధి సిబ్బంది మాత్రం చివర్లో ఎంబుక్స్‌కు సంబంధించిన వివరాలను అప్‌లోడ్ చేశారు. అయితే తాము అప్‌లోడే చేశామని, అవినీతి, అక్రమాల్లో తమకెలాంటి సంబంధంలేదని సమగ్ర శిక్ష అధికారులు పేర్కొంటున్నారు. అవినీతిపై నిగ్గుతేల్చేందుకు గానూ జిల్లాకు 15 మంది ఎస్సార్పీలను పీఆర్ కమిషనర్ పంపారు. అయితే ఎంబుక్స్, ఇతర వివరాలను సమగ్ర శిక్షకు సంబంధించిన మండలాధికారులు తీసుకురావడంలేదని సమాచారం. తమ వద్ద సమాచారం లేదని కొందరు బదులిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకపోతే బ్యాంక్ ఖాతాల్లో జమైన నగదును ఎందుకు తిరిగిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిర్మాణాలు పూర్తయిన చోట రెండోసారి బిల్లులేశారు. కీలకమైన అధికారుల సహాయ, సహకారాల్లేనిదే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఈ ప్రక్రియను చేపట్టడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. కొంత మంది అధికారులు వారి బంధువులను కాంట్రాక్టర్లుగా ఎంపిక చేసి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమయ్యేలా చేశారు. బిల్లులు చెల్లించే సమయంలో వీరిలో ఎవరైనా మరణిస్తే కాంట్రాక్టర్‌ను మార్చి మరొకరికి క్రెడిట్ అయ్యేలా చేశారు. ఇన్ని లొసుగులు చోటుచేసుకున్న తరుణంలో విచారణకు సహకరించకపోతే ఏసీబీ ఎంకై ్వరీకి ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.


