వెంకటాచలం: సర్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. వెంకటాచలంలో గురువారం సాయంత్రం పర్యటించిన ఆయన మాట్లాడారు. ఈ విషయంలో అధికారులపై టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. స్వయంగా కూటమి ఎమ్మెల్యేలే వీరికి ఫోన్లు చేసి ఇలా వ్యవహరించాలని హుకుం జారీ చేస్తూ.. అధికార దుర్వినియోగంతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని అర్హతలున్నా తమ పార్టీ మద్దతుదారులకు నోటీసులిస్తూ.. అర్హత లేకపోయినా టీడీపీ వారికి జారీ చేయడంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలిచ్చిన చంద్రబాబు.. చివరికి నమ్మకం లేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. తమ పార్టీ మద్దతుదారులకు కేటాయించిన ప్లాట్లు, అసైన్‌మెంట్ భూములను రద్దు చేసేందుకు కుట్రలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు అన్ని రకాల విచారణలు జరిపి అసైన్‌మెంట్ భూములను అర్హులకు చట్టబద్ధంగా ఇచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి తెచ్చి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులను రద్దు చేయించడం దారుణమన్నారు. ఇందులో తప్పులుంటే ముందుగా అధికారులపై చర్యలు చేపట్టాలే గానీ, కేవలం తమ పార్టీకి చెందిన వారి భూములను రద్దు చేయడం సరికాదని హితవు పలికారు.
సర్వేపల్లిలో సర్వం దోపిడీ
కూటమి ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు రాజ్యమేలుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శివాలయ భూములను ఆక్రమించి లేఅవుట్ వేసిన యజమానుల వద్ద ఎలాంటి లబ్ధి పొందలేదంటూ ప్రమాణం చేయగలరానిని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ విషయంలో ఆయన కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో తన నాయకత్వంలో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని స్పష్టం చేశారు. వెంకటాచలం పంచాయతీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి మాజీ సర్పంచ్ మందల రాజేశ్వరి, ఆమె భర్త మందల వెంకటశేషయ్య ఎంతో కృషి చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వెంకటాచలం పంచాయతీలో టీడీపీ నేతలు ఎన్ని ఇబ్బందులను సృష్టించినా, అన్నింటినీ దీటుగా ఎదుర్కొని సమర్థంగా పాలించారని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ పారిశుధ్య లోపం పెరిగిపోయిందని, అపరిశుభత్ర రాజ్యమేలుతున్నా, పట్టించుకునే వారే కరువయ్యార ని ధ్వజమెత్తారు. తమ పార్టీ నేత సండ్రా రవి సజీవంగా ఉన్న సమయంలో ఆయన దుకాణం వద్ద గుంతలను టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తవ్వించి వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలు, కక్షసాధింపు చర్య లను లెక్కగడుతున్నామని వీటన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కాకాణి స్పష్టం చేశారు.
సండ్రా రవి మృతిపై దిగ్భ్రాంతి
అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన సండ్రా రవి నివాసానికి కాకాణి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కాంక్షించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, నేతలు కొణిదెన విజయభాస్కర్‌నాయుడు, మందల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
సర్ ప్రక్రియలో అధికారులపై కూటమి ఎమ్మెల్యేల ఒత్తిడి
అధికార దుర్వినియోగంతో
రాజ్యాంగం అపహాస్యం
ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


