● రెగ్యులర్ చేయాలంటూ సంతకాల సేకరణ
● ఆన్‌లైన్ సేవలు ఆపడంతో
రోగులకు ఇక్కట్లు
నెల్లూరు(అర్బన్): డిమాండ్లు తీర్చాలంటూ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కేర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బోధనాస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. నర్సులు, కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు నల్లరిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతూ భోజన విరామ సమయంలో ధర్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తమ ఆందోళనకు మద్దతుగా సంతకాలు సేకరణ చేపట్టారు. డాక్టర్లు, రెగ్యులర్ నర్సులు, ఉద్యోగులు, ఆస్పత్రికి వచ్చేవారికి తమ న్యాయమైన డిమాండ్లు వివరిస్తూ తమ ఆందోళనలకు మద్దతుగా సంతకాలు సేకరించారు.
20 సంవత్సరాల క్రితమే..
మధ్యాహ్నం ఐపీ భవనం వద్ద ధర్నా జరిగింది. వీరి ఆందోళనకు మద్దతుగా పాల్గొన్న యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సందాని బాషా మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి యువతకు రెగ్యులర్ ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు. ఈ విధానం సమాజానికి మంచిది కాదన్నారు. సెలవులు, పెన్షన్ లాంటి ఎలాంటి సౌకర్యాల్లేకుండా కేవలం జీతంపైనే ఆధారపడి కాంట్రాక్ట్ పద్ధతిలో 15 నుంచి 20 ఏళ్లకు పైగా నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు పని చేస్తున్నారన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జేఏసీ రాష్ట్ర నాయకురాలు రూత్‌గ్రేస్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలన్నారు. అప్పటి వరకు వంద శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, విధినిర్వహణలో మరణించిన కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషి యా ఇవ్వాలన్నారు. ఈపీఎఫ్‌తోపాటు అనారోగ్యానికి గురైతే వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మ్యూచ్‌వల్, రిక్వెస్ట్ బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈనెల 8 నుంచి అన్ని రకాల సేవలు ఆపేసి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
రోగులకు తప్పని తిప్పలు
కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న నర్సులు ఆన్‌లైన్ సేవలు ఆపేయడంతో రెండోరోజు కూడా రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి ఓపీలు ఇవ్వడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదయం 8 గంటలకు రోగులకు ఓపీలు రాయాల్సి ఉండగా 9:30 గంటల వరకు కూడా ఇవ్వలేదు. న్యూరోఫిజీషియన్ పక్కనే ఉండే ఓపీ రూమ్‌లో అయితే ఏకంగా 10 గంటల వరకు కూడా సిబ్బంది రాకపోవడంతో రోగులు గంటలపాటు నిలబడిపోయారు. పదిగంటలకు ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు వచ్చిన తర్వాతే ఓపీలు రాయడం మొదలు పెట్టారు. దీంతో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు.


