● రోడ్డు ప్రమాదంలో 17 మందికి గాయాలు
● క్షతగాత్రులు జార్ఖండ్‌కు చెందిన కూలీలు
● పరామర్శించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
వెంకటాచలం: దోస్త్ వాహనం బోల్తా పడి 17 మంది జార్ఘండ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు గాయపడిన ఘటన వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 21 మంది కూలీలు తిరుపతి జిల్లా బాలాయపల్లి సమీపంలోని దగ్గవోలు వద్ద విద్యుత్ లైన్ల మార్పిడికి సంబంధించిన పనుల నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. వీరంతా దోస్త్ వాహనంలో నెల్లూరు నుంచి బాలాయపల్లికి వెళ్తుండగా చెముడుగుంట సమీపానికి చేరుకోగానే ముందుగా వెళ్తున్న లారీ నెమ్మదించడంతో దోస్త్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పర్యవేక్షించిన కలెక్టర్
నెల్లూరు(అర్బన్): క్షతగాత్రుల్లో ఒకరిని పెద్దాస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆస్పత్రికి చేరుకుని రోగులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను విచారణ జరిపి నివేదిక అందించాలని డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ అనూష, కార్మికశాఖ అధికారి విజయకుమార్‌రెడ్డిని ఆదేశించారు. రోగులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓ కాంట్రాక్టర్ 21 మంది కూలీలను జార్ఖండ్ నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చినట్లు చెప్పారు. క్షతగాత్రులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.10 వేలు, ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్‌కు రూ.లక్ష అందించాలని కాంట్రాక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమాచారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపి ఫోన్ పే ద్వారా నగదు అందించాలని పేర్కొన్నారు. బాధితులంతా కోలుకునే వారికి వారి యోగక్షేమాలు చూసుకోవాలని, వేతనాన్ని కూడా పూర్తిగా చెల్లించాలన్నారు.
నర్సులపై ఆగ్రహం
కలెక్టర్ క్షతగాత్రులను పరిశీలించేందుకు ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా వారికందుతున్న వైద్యం పరిశీలించి నర్సులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పేషెంట్‌కు శరీరంపై మట్టి కూడా క్లీన్ చేయలేదని, మీ అన్న, తమ్ముడికో ప్రమాదం జరిగితే ఇలాగే వైద్యం చేస్తారా అని ప్రశ్నించారు. హక్కులంటూ సమ్మెలు చేయడమే కాదు.. సేవలు కూడా సక్రమంగా నిర్వర్తించాలంటూ హితవు పలికారు. ఇదే సందర్భంలో సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని ఉద్దేశించి మాట్లాడుతూ కనీసం మీరు రౌండ్స్ వేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. లిఫ్ట్ ఎందుకు పని చేయలేదని ప్రశ్నించారు. దీంతో సూపరింటెండెంట్ ఇప్పుడే ఆగిపోయిందని బదులిచ్చారు. దీంతో కలెక్టర్ చిరాకు పడ్డారు. ఎప్పుడు అడిగినా ఇలాగే చెబుతారా అంటూ ప్రశ్నించారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు తదితరులు రోగులను పరామర్శించారు.


