నెల్లూరు(అర్బన్): ఆర్‌అండ్‌బీ శాఖలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఓ వ్యక్తి మరణించగా, అతని భార్య తుపాకుల వెంకటరమణమ్మకు ఒకటిన్నర సంవత్సరంగా కారుణ్య నియామకం కింద ఉద్యోగ ఇవ్వనందున నష్టపరిహారం చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అసోసియేట్ చైర్మన్ ఈవీఎం శరత్‌బాబు డిమాండ్ చేశారు. వెంకటరమణమ్మకు నష్టపరిహారంతోపాటు జియావుల్ హక్ అనే వ్యక్తికి కారుణ్య నియామక ఉత్తర్వులు ఇవ్వాలంటూ మంగళవారం నెల్లూరు దర్గామిట్టలోని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శరత్‌బాబు మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ శాఖలో బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. వెంకటరమణమ్మ తన భర్త మృతిచెందిన తర్వాత బతికేందుకు చాలా అవస్థలు పడుతోందన్నారు. ఇంటిపై రుణం తీసుకుని ఉన్నందున బ్యాంక్ వారు తాళాలు తీసుకుని ఆమెను బయటకు నెట్టేశారన్నారు. సకాలంలో ఉద్యోగం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మరో గిరిజన మహిళకు ఇలా జరగకుండా ఉండాలన్నారు. ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. జియావుల్ హక్‌కు ఇంకా ఉద్యోగం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అలాగే మినిస్టీరియల్ ఉద్యోగులకు, వర్క్ చార్జెడ్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.


