● చైనాకు చెందిన డౌతో
సంబంధాలపై సమాధానమివ్వాలి
● కేంద్ర మంత్రి జైశంకర్‌కు లేఖ రాసింది నిజం కాదా..?
● కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నాం
● మాజీ మంత్రి
అనిల్‌కుమార్‌యాదవ్
నెల్లూరు రూరల్: జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాత్ర ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. డబ్బున్న కొందరు వైట్‌కాలర్ నేరాలకు పాల్పడిన తరహాలో ఆయనా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను సంధించిన ప్రశ్నలకు గానూ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని విమర్శించారు.
డౌతో సంబంధమేమిటి..?
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లేఖ రాశారని, చైనాకు చెందిన ఐదుగురికి ఇక్కడ మైనింగ్ వ్యాపారానికి అనుమతులివ్వాలని అందులో కోరారనే ఆధారాలను అనిల్ చూపారు. వీరిలో డౌ సైతం ఉన్నారని, ఆయనతో వేమిరెడ్డికి ఉన్న సంబంధమేమిటో తెలియజేయాలని డి మాండ్ చేశారు. ఇందులో వేమిరెడ్డికి సంబంధం లేదంటూ రవిచంద్ర మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. వేమిరెడ్డి ఆధ్వర్యంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలొస్తున్నాయని, దీనిపై ఆయన ఆన్సరివ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను మైనింగ్ యజమానులు తన దృష్టికి తీసుకొచ్చారని, వీరి బాధలపైనే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. గనులుంటేనే మైనింగ్‌పై మాట్లాడాలానని ప్రశ్నించారు.
మేయర్‌నని చైనాలో
పరిచయం చేసుకున్నారు..!
నవంబర్ ఐదు, 2024 మేయర్‌గా గిరిజన మహిళ ఉన్న సమయంలో, మరో వ్యక్తి చైనాలో తనను తాను మేయర్‌గా పరిచయం చేసుకోవడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. వేమిరెడ్డికి చెందిన వ్యక్తిగా పేర్కొంటున్న రమణకుమార్‌తో కలిసి చైనాలోని సినోమా అనే కంపెనీ వద్దకెళ్లి, ఇలా చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించే తీవ్రమైన అంశమన్నారు. ఈ వ్యవహారం వేమిరెడ్డికి తెలిసే జరిగిందానని ప్రశ్నించారు.
ఎందుకు వెనుకేసుకొస్తున్నారు..?
మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను ప్రశ్నించారు. ఫేక్ మేయర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో ఇంకా ఎన్ని స్కాములు జరిగాయో వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తిని దగ్గర పెట్టుకోవడం వెనుక వేమిరెడ్డితో ఏమైనా లోపాయికారీ ఒప్పందం ఉందాననే అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. రవిచంద్ర, నారాయణ, శ్రీధర్‌రెడ్డికి అనిల్ పలు ప్రశ్నలను సంధించారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తిని డిప్యూటీ మేయర్ పదవి నుంచి వెంటనే తొలగించాలని కోరారు. దీనంతటికీ బాస్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నానని, కూటమి ప్రభుత్వ హయాంలో ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉదంతంపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. పూర్తి వివరాలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తాము కూడా రాజకీయాల్లో సేవ చేశామని, అయితే ఇలాంటి మోసాలకు పాల్పడలేదని చెప్పారు.
చట్టానికెవరూ అతీతులు కారు
డబ్బున్నంత మాత్రాన చట్టానికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి దమ్ముంటే తాను చేసిన ఆరోపణలపై బహిరంగంగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మైనింగ్, చైనా లింకులు, ఫేక్ మేయర్ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.


