నెల్లూరు(అర్బన్): దాదాపు రెండున్నరేళ్లుగా నిరీక్షించినా.. ఎన్నో వినతిపత్రాలిచ్చినా.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం, నాన్చుడు ధోరణిని అవలంబించడంతో ఉద్యమాన్ని ప్రారంభించామని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు మంగళవారం హాజరై నిరసన తెలిపారు. ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, కలెక్టరేట్, వైద్య, ఆరోగ్య శాఖ ఇలా అన్ని విభాగాల ఉద్యోగులు ఇలా విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమాన్ని దశలవారీగా విస్తరిస్తూ.. దీర్ఘకాలిక పోరుబాటగా మారుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నామని వెల్లడించారు. తొలి రోజు భోజన విరామ సమయంలో ధర్నాలను చేపట్టామన్నారు. సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి అనే నినాదం ప్రతి ఉద్యోగి తమ వాట్సాప్ డీపీగా పెడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా తమకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలను విడుదల చేయడంతో పాటు పీఆర్సీని వేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి
నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు


