కాంట్రాక్ట్‌ నర్సుల ఆందోళన ఉధృతం | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ నర్సుల ఆందోళన ఉధృతం

Sep 1 2026 12:19 AM | Updated on Sep 1 2026 12:19 AM

జీజీహెచ్‌లో ఆన్‌లైన్‌ సేవలు బంద్‌

ఓపీ కోసం బారులు తీరిన రోగులు

నెల్లూరు(అర్బన్‌): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళనలను కాంట్రాక్ట్‌ నర్సులు ఉధృతం చేశారు. గత వారం రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన వారు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సోమవారం ఆన్‌లైన్‌ సేవలను నిలిపేశారు. ఇప్పటి వరకు కాంట్రాక్టు నర్సులు ఆన్‌లైన్‌ సేవలందిస్తుండటంతో ఓపీ సాఫీగా జరిగి పోయేది. అయితే ఇప్పుడు వారి ఆందోళనల నేపథ్యంలో ఆన్‌లైన్‌ చేసి ఓపీ రాసిచ్చే వారు లేకపోవడంతో ఓపీ రూముతో పాటు వరండాలో వందల సంఖ్యలో రోగులు బారులు తీరి నిలబడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, తదితరులు హడావుడిగా ఆరోగ్యశ్రీ, ఇతర విభాగాల వద్ద ఉండే డేటాఎంట్రీ ఆపరేటర్లను పిలిపించి ఆన్‌లైన్‌ ద్వారా ఓపీలు రోగులకు అందజేయాలని కోరారు. అంతలోనే సర్వర్‌ కూడా కొంతసేపు పని చేయలేదు. ఉదయం 8 గంటల నుంచే ఓపీ చీటీలు రాయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ మందికి 11.30 గంటల వరకు కూడా ఇవ్వలేదు. రోగులు ఓపీలు తీసుకుని డాక్టర్‌ను కలిసే సమయానికి మధ్యాహ్నమైంది. దీంతో వైద్యులు నామమాత్రంగా పరీక్షలు రాసేసి వెళ్లిపోయారు. రోగులు పరీక్షలు చేయింకుని వచ్చేసరికి వైద్యులు అందుబాటులో లేరు. దీంతో శిక్షణ పొందుతున్న జూనియర్‌ వైద్యులే దిక్కయ్యారు. కాంట్రాక్ట్‌ నర్సుల ఆందోళనతో రోగుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.

నల్లరిబ్బన్లు ధరించి నిరసన

భోజన విరామసమయంలో నర్సులు నల్లరిబ్బన్లు ధరించి ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా సీఐటీయూ నాయకులు సతీష్‌, సందానిబాషా మద్దతు తెలిపారు. జేఏసీ కన్వీనర్‌ శరత్‌బాబు మాట్లాడుతూ తమను రెగ్యులర్‌ చేయాలని అంతవరకు 100 శాతం గ్రాస్‌ శాలరీతో కూడిన వేతనం మంజూరు చేయాలని, విధి నిర్వహణలో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు రూ 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికి ఈపీఎఫ్‌ చెల్లించాలని, జబ్బుచేస్తే వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్న తమకు రిక్వెస్ట్‌ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము సేవలు బంద్‌ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సులు మేరి, మాధురి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement