● ఏపీజేఏసీ అమరావతి నాయకులు
● కలెక్టర్‌కు ఉద్యోగ సంఘాల నోటీసు
నెల్లూరు (అర్బన్): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ బకాయిలు సాధించుకునేందుకు సమరానికి సన్నద్ధంగా ఉన్నామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి, కార్యదర్శి ప్రసాద్, మహిళా విభాగం చైర్‌పర్సన్ బాలకోటమ్మ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో దశల వారి ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటిని, తాము దాచుకున్న డబ్బులను చెల్లించాలని కోరుతూ పోరాటం ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా పీఆర్సీ పెండింగ్‌లో ఉందన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్ నియామకం, మధ్యంతర భృతి, ెపెండింగ్‌లో ఉన్న 5 డీఏల విడుదల, పింఛన్‌దారులకు అదనపు క్వాంటమ్ పింఛన్ పునరుద్ధరణ తదితర 29 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యాక రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లో తీవ్ర జాప్యం వల్ల వృద్ధాప్యంలో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. మంగళవారం నుంచి ఉద్యమ కార్యాచరణ పూర్తయ్యే వరకు సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి అంటూ ఉద్యోగులు డీపీలో ఫొటో ప్రదర్శిస్తారన్నారు. 5వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో విధుల్లోకి వచ్చి నిరసన, 9వ తేదీ వరకు తమకు జరుగుతున్న నష్టాలపై కరపత్రాల పంపిణీ, 11న ట్రేడ్ యూనియన్లతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 నుంచి 26వ తేదీ వరకు పని గంటల సమయంలో మాత్రమే పని చేస్తామని మిగిలిన సమయంలో అధికారులకు సహకరించేది లేదన్నారు. అనంతరం ధర్నాలు, ఆందోళనలు చేస్తామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె బాట పడుతామన్నారు. సంఘ నాయకులు చెన్నమ్మ, పరంధామయ్య, శ్రీనివాసులు, ధారా రమణయ్య, సతీస్, కొండలరావు, జమీర్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.


