ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన యర్రంరెడ్డి సుబ్బరాయుడికి సర్వే నంబర్ 192లో పొలాలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ గ్రామంలో రీసర్వే చేపట్టారు. ఆయనకున్న భూమిలో సుమారు 6 ఎకరాలు ఒరిజినల్ పట్టా భూమిని చుక్కల భూమిగా మార్చేశారు. రైతుకు కూడా ఆ విషయం తెలియదు. సుమారు 6 నెలల తర్వాత ఈ విషయం తెలుసుకున్న రైతు లబోదిబో మంటూ అధికారుల వద్దకు పరిగెత్తాడు. తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది జరిగిందేదో జరిగింది. ఫైల్ కలెక్టర్‌కు పెట్టాలని చెప్పారు. రెవెన్యూ అధికారులు చెప్పిన ప్రకారం రైతు అన్ని పత్రాలను జత చేసి తహసీల్దార్ ద్వారా కలెక్టర్‌కు వినతిపత్రం పెట్టుకున్నాడు. కలెక్టరేట్ అధికారులు పట్టించుకోలేదు. రైతు కుటుంబీకులు కలెక్టరేట్ చుట్టూ తిరిగి ఫైల్ సంగతి గురించి కలెక్టరేట్‌లోని సంబంధిత సెక్షన్ డిప్యూటీ తహసీల్దార్‌ను కలవగా, ఈ ఫైల్ అన్ని సమస్యలతో కలిపి వచ్చింది.. ఇలా కాకుండా ప్రత్యేకంగా పంపాలని చెప్పారు. దీంతో మళ్లీ మొదటి నుంచి అంటే వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీఓ నుంచి కలెక్టరేట్ వరకు ఫైల్ నడపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫైల్ రైతు పంపించి ఇప్పటికే మూడు నెలలైంది. అది ఏ దశలో ఉందో.. ఎక్కడ ఆగిందో కూడా అధికారులు చెప్పడం లేదని ఆ రైతు ఆవేదన చెందు తున్నాడు.
అల్లూరు మండలం నార్ ఆములూరు గ్రామానికి చెందిన మౌలాసాహెబ్ అనే వ్యక్తికి సుమారు 7 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో నుంచి ఆయన తన కుమార్తెకు పసుపు కుంకుమ కింద ఒక ఎకరా భూమిని రాసిచ్చాడు. అయితే సంవత్సరం క్రితం జరిగిన రీ సర్వేలో కుమార్తెకు రాసిచ్చిన భూమిని పక్క పొలంలో ఉండే వారి సర్వే నంబర్ మీద ఎక్కించేశారు. పక్కన ఉండే రైతు ఇప్పుడు ఆ రైతును ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో తండ్రీ కూతురుకు మధ్య తకరారు ఏర్పడింది. తండ్రి అధికారుల చుట్టూ తిరుగుతూ అయ్యా ఆ భూమి తన కుమార్తెది. సరి చేయండి అని కోరితే మ్యుటేషన్‌కు ఫీజు కట్టమన్నారు. మ్యుటేషన్ ఫీజుతోపాటు సంబంధిత వీఆర్వోకు అమ్యామ్యాలు ముట్టచెప్పారని తెలుస్తోంది. అయినా ఆ ఫైల్ ఇంకా క్లియర్ కాలేదు.
ఉన్నదే ఎకరం.. పూర్తిగా పక్క రైతుకు కట్టబెట్టేశారు..
చుక్కలు చూపించారు..
● రైతుల మధ్య భూ విస్తీర్ణాల తకరారులు
● కొనుగోలు పత్రాలు, రెవెన్యూ
రికార్డులు చూడరు
● ఎవరి అధీనంలో ఉంటే అంతటికి
హక్కు పత్రాలు
● ఆక్రమణ భూములను కట్టబెట్టేస్తున్నారు
● ప్రభుత్వ శివాయి, చెరువు, మేత
పొరంబోకు భూములు ధారాదత్తం
● తేడాలు పరిష్కరించకుండా..
కోర్టుకెళ్లమంటూ ఉచిత సలహాలు
● సామాన్యుడికి
చుక్కలు చూపిస్తున్న రెవెన్యూ
● ఫైళ్ల క్లియరెన్స్ కోసం
కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు
నెల్లూరు (అర్బన్): ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కలెక్టర్ కార్యాలయం సామాన్యుడికి అందనంత దూరంలో ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్న భూముల రీసర్వే తప్పుల తడకగా, అత్యంత వివాదాస్పదంగా మారింది. స్థానిక రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భూ తకరాలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీసర్వే తర్వాత పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చుతున్నారు. రైతులకు తెలియకుండానే వారి భూములు నోషనల్ ఖాతాలోకి మార్చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న భూముల సరిహద్దు భూ తకరారులను పరిష్కరించేందుకు చేపట్టిన రీ సర్వేను తప్పదోవ పట్టించి.. రైతులకు కడగండ్లు మిగులుస్తున్నారు. దశాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉండాల్సిన భూ విస్తీర్ణాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న భూ విస్తీర్ణాలకు ఉన్న తేడాలను పరిశీలించి, సరిహద్దు వివాదాలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు కొత్త తరహా సమస్యలను సృష్టిస్తున్నారు. కోర్టుకెళ్లి తేల్చుకోండంటూ చెప్పి ముఖం చాటేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ చేసే తప్పులకు రైతులు బలవుతున్నారు. అధికారులు చేసే తప్పులను సరిదిద్దాల్సిన కలెక్టర్ పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రీ సర్వేలో అధికారిక లెక్కలు ఇలా..
రీసర్వే ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు 493 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. 50 గ్రామాల్లో సర్వే పనులు పురోగతిలో ఉన్నాయి. రీ సర్వేపై వచ్చిన 8,761 అర్జీలను పరిష్కరించినట్లు చెప్పుకుంటున్నారు. మిగిలిన 147 గ్రామాల్లో మార్చి నాటికి రీసర్వే పూర్తి చేస్తామంటున్నారు. అధికారులు పరిష్కరించినట్టు చెబుతున్న అర్జీలను పరిశీలిస్తే కొంత మంది నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ తహసీల్దార్‌కు రాసి పరిష్కరించినట్టు పేర్కొంటున్నారు. తీరా పరిశీలిస్తే ఆ ఫైల్ ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి.
ఫైల్ కదలాలంటే పైసలతోనే పని
రెవెన్యూ శాఖలో భూ రికార్డులు, మ్యుటేషన్, వారసత్వం, పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వే, సరిహద్దులు, ఆక్రమణలు వంటి వాటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటికి సంబంధించి చిన్నపాటి సాంకేతిక సమస్య కూడా సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్ర అష్ట కష్టాలు పడుతున్నారు. అధికారికంగా అర్జీలను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ ప్రకటిస్తున్నప్పటికీ సంబంధిత ఫైళ్లు కదలడం లేదు. కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ వ్యవస్థలో పని జరగాలంటే బాధితులు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. రాజకీయంగా సిఫార్సు చేయించుకుంటున్నారు. నెలల తరబడి తిరిగి అధికారులకు అమ్యామ్యాలు ముట్ట చెప్పి పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పేరుకుపోతున్న ఫైళ్లు
కలెక్టరేట్‌లో మ్యుటేషన్, నోషనల్ ఖాతా, చుక్కలు భూములు, రీ సర్వే వివాదాల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు సకాలంలో క్లియర్ చేయడం లేదు. వేలకు వేలుపైనే ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు సమయ పాలన పాటించడం లేదు. ఫైళ్లు గురించి పట్టించుకోవడం లేదు. అందువల్లనే ఇలా గుట్టలుగా ఫైళ్లు పోగవుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. కలెక్టరేట్ అంటే తమ సమస్యకు పరిష్కారం దొరికే గుమ్మంగా మారాలి. కలెక్టరేట్ చుట్టూ కాళ్లకు విశ్రాంతి దొరకాలి. ఫైళ్లు కదలాలి. అర్జీలకు పరిష్కారం కావాలి.
బోగోలు మండలం అల్లిమడుగు రెవెన్యూ గ్రామ పరిధిలో పూర్వ సర్వే నంబరు 65లోని భూమి సీలింగ్‌గా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీన్ని కొన్నేళ్ల క్రితం అన్నదమ్ములైన రైతులు కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసినా.. అప్పటి అధికారులు ముడుపులు పుచ్చుకుని రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేశారు. ఇటీవల ఆ గ్రామంలో చేపట్టి రీ సర్వేలో సీలింగ్ భూమి అని తెలిసినా.. పాత రికార్డుల జోలికి వెళ్లికుండా.. సదరు రైతులకు సీలింగ్ భూమితోపాటు పక్కన ఉన్న సర్వే నంబరు 61లోని ఇతరుల పేరిట రిజిస్టర్ డాక్యుమెంట్లు కలిగిన మరో మూడెకరాలు కూడా వీరి ఆక్రమణలో ఉండడంతో ఆ భూమిని కూడా వీరి పేరిట కట్టబెట్టారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. జిల్లాలో రెండేళ్లల్లో ఇలాంటి భూ వివాదాలు లెక్కకు మించి ఉన్నాయి.
సీసీలదే హవా..
సోమవారం జరిగే గుంపులో గోవింద అనే గ్రీవెన్స్‌లో మినహా కలెక్టరేట్‌లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో తదితరులను కలిసి తమ బాధలు చెప్పుకోవాలంటే సామాన్యుడికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీసీలు చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్యులు సైతం తను నేరుగా కలవ వచ్చని చెప్పిన కలెక్టర్ ఆచరణలో అందుకు భిన్నంగా పైరవీకారులకు, సిఫార్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తెలిసిన వారో.. మధ్యవర్తుల ద్వారా వెళ్తే పనులు త్వరగా జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉండాల్సి వస్తుందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.


