పేదల కల సాకారానికే జగనన్న కాలనీలు | - | Sakshi
Sakshi News home page

పేదల కల సాకారానికే జగనన్న కాలనీలు

Aug 29 2026 12:11 AM | Updated on Aug 29 2026 12:11 AM

గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పేరొస్తుందనే నిలిపివేత

న్యాయస్థానాల్లో సైతం

అడ్డుకునేందుకు ప్రభుత్వ యత్నం

లేఅవుట్లో ప్లాట్లనూ వదలకుండా గ్రావెల్‌ దందా

ధ్వజమెత్తిన మాజీ మంత్రి

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: దశాబ్దాలుగా ఇల్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో ఊళ్లనే నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేశామని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు సమీపంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జగనన్న కాలనీలో పక్కా గృహాలను జగనన్న కాలనీ – చంద్రబాబు కహానీ పేరుతో పార్టీ శ్రేణులు, లబ్ధిదారులతో ర్యాలీగా వెళ్లి శుక్రవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపేయడంపై మండిపడ్డారు. జగనన్న గృహం – చంద్రబాబు ద్రోహం పేరిట ప్రజాచైతన్య కార్యక్రమాలను ఇక నుంచి ప్రతి మంగళవారం నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే స్థాయిని సోమిరెడ్డి దిగజార్చుకొని చౌకబారు పనులు చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా నిలిచామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 25 లక్షల గృహాలను మంజూరు చేశామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా నివేశన స్థలాలు, ఇళ్లను ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు.

అతిపెద్ద టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దాం

పొదలకూరు సమీపంలోని చిట్టేపల్లి తిప్పకు దిగువన 45 ఎకరాల్లో 1500 కుటుంబాలకు జగనన్న కాలనీలో ప్లాట్లను కేటాయించి నుడా నిబంధనల మేరకు 40, 50 అడుగుల వెడల్పు రోడ్లను నిర్మించడమే కాకుండా మౌలిక సదుపాయాలను కల్పించి అతిపెద్ద టౌన్‌షిప్‌గా మార్చామని పేర్కొన్నారు. 1100 ఇళ్లను మంజూరు చేసి, 530 నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించి, వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అమరావతి తరహాలో ఇక్కడా ఇళ్లు నిర్మించేందుకు వీల్లేదంటూ న్యాయస్థానాలను సోమిరెడ్డి అండ్‌ కో ఆశ్రయిస్తే సమర్థంగా వాదనలు వినిపించడంతో వీరి పిటిషన్‌ వీగిపోయిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడి ఇళ్లకు గ్రహణం పట్టిందని, నాణ్యత లేకుండా నిర్మించారంటూ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారని తెలిపారు. అయితే ఇళ్లను పరిశీలించిన నిపుణులు, విజిలెన్స్‌ అధికారులు నివాసాలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయనే నివేదికను ఇచ్చారన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి మండలాన్ని అర్బన్‌ పరిధిలోకి తీసుకురావడంతో ఇంటి నిర్మాణానికి రూ.2.15 లక్షల వరకు అందజేసే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. అయితే వీటిని చంద్రబాబు తొలగించడంతో ప్రస్తుతం రూ.1.59 లక్షలే సాయమే అందుతోందని వివరించారు.

హద్దు రాళ్లను పీకేసీ గ్రావెల్‌ దందా

జగనన్న లేఅవుట్లో హద్దు రాళ్లను పీకేసీ కొండకింద ఏర్పాటు చేసిన ప్లాట్లలో నాణ్యమైన గ్రావెల్‌ను అధికార పార్టీకి చెందిన వారు అక్రమంగా తరలించారని ఆరోపించారు. మహిళలకు కేటాయించిన ప్లాట్లలో గ్రావెల్‌ గుంతలు ఏర్పడటంతో లబ్ధిదారులు కన్నీరుమున్నీరవుతున్నారని చెప్పారు. విద్యుత్‌ స్తంభాలు, ప్లాట్లలో గ్రావెల్‌ దందాతో ఏర్పడిన పెద్ద గోతులను చూపారు. నేతలు పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, వాకాటి శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ నిర్మలమ్మ, ఎంపీటీసీలు లక్ష్మీకల్యాణి, శ్రీనివాసులు, వూకోటి లక్ష్మీనారాయణ, రావుల ఇంద్రసేన్‌గౌడ్‌, వేణుగోపాల్‌రెడ్డి, అంజద్‌, వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement