నెల్లూరు (టౌన్): కూటమి పాలన చిరుద్యోగుల కన్నీటి వేదనగా మారింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ పాలనలోని విద్యాశాఖలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఆయాలు, వాచ్‌మెన్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నెల నెలా వేతనం ఇస్తేనే బతుకు జీవనం గడవని పరిస్థితి వారింది. వారికి చెల్లించేది కూడా చాలా తక్కువ వేతనం. చాలీచాలని వేతనంతోనే కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటిది గత 5 నెలలుగా ఆయాలు, వాచ్‌మెన్‌లకు వేతనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరనో.. రోడ్డెక్కి ఉద్యమాలు చేయలేరనో వారికి నెలనెలా వేతనాలు చెల్లించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో రూ.లక్షల్లో జీతాలు తీసుకునే వారికి మాత్రం నెలనెలా క్రమం తప్పకుండా వేతానాలు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం చిరుద్యోగుల విషయంలో నిర్దయగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాఠశాలల పర్యవేక్షణలో కీలకం
జిల్లాలో 2,421 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2686 మంది ఆయాలు, 255 మంది వాచ్‌మెన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాల సామర్థ్యాన్ని బట్టి ఒకరు లేదా ఇద్దరు ఆయాలు ఉంటారు. ప్రతి రోజు పాఠశాలలోని గదులతో పాటు పరిసరాలు, టాయ్‌లెట్స్ క్లీన్ చేస్తుంటారు. పాఠశాల పరిస్థితిని బట్టి వాచ్‌మెన్‌లను నియమిస్తారు. రాత్రి సమయంలో పాఠశాలకు కాపలా ఉంటారు. రాత్రి సమయంలో, సెలవు దినాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు వీరు విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఆయాలు ఒక రోజు సెలవు పెడితే పాఠశాలలో ఉండలేని పరిస్థితి. విద్యార్థులు, ఉపాధ్యాయులు టాయ్‌లెట్స్ నుంచి వచ్చే దుర్గంధంతో ఇబ్బందులు పడుతుంటారు. వేసవి సెలవుల సమయంలో పాఠశాలలోని వాటర్ ట్యాంకు, గదులను శుభ్రం చేస్తుంటారు. పాఠశాలల పర్యవేక్షణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వీరి విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వాచ్‌మెన్‌లు, ఆయాలకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తోంది.
వైఎస్సార్‌సీపీ పాలనలో ఠంఛన్‌గా..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాక ముందు ఒకటీ.. అర పాఠశాలల్లో వాచ్‌మెన్లు, ఆయాలు ఉండేవారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు బడులను నాడు–నేడు పథకం ద్వారా రూపురేఖలు మార్చుతూ అభివృద్ధి చేపట్టారు. ఈ క్రమంలో ఆయా పాఠశాలలకు వాచ్‌మెన్లను, ఆయాలను నియమించారు. అప్పట్లో అమలు చేసిన అమ్మఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఆర్థిక సాయం నుంచి మినహాయించిన రూ.2 వేలను పాఠశాలల ఖాతాల్లో జమ చేసి వాచ్‌మెన్లు, ఆయాలకు జీతాలతోపాటు పాఠశాలల్లో పారిశుధ్య చర్యలకు వినియోగించారు. దీంతో ప్రతి నెల వీరికి ఠంఛన్‌గా జీతాలను అందించారు. కూటమి పాలన వచ్చాక వీరి కష్టాలు మొదలయ్యాయి.
రూ.7.58 కోట్ల బకాయిల పెండింగ్
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, వాచ్‌మెన్లకు గత 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. వీరికి నెలకు రూ.6 వేలు వేతనం చెల్లిస్తారు. మే, జూన్ నెలల్లో పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో రూ.3 వేలు చెల్లిస్తున్నారు. వీరికి ఈ ఏడాది మార్చి వరకు వేతనం చెల్లించినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు వేతనాలు చెల్లించలేదు. ఆగస్టు నెలతో కలిపితే 5 నెలలు వేతనాలు పెండింగ్‌లో ఉంటాయి. ఆయాలకు సంబంధించి నెలకు రూ.6 వేలు లెక్కన 3 నెలలకు రూ.4,83,48,000 బకాయిలు ఉన్నాయి. మే, జూన్ నెలలో వేతనం రూ.3 వేలు లెక్కన 2 నెలలకు రూ.1,61,16,000 బకాయి ఉంది. మొత్తం కలిపితే 5 నెలలకు రూ.6,44,64,000 పెండింగ్‌లో ఉన్నాయి. వాచ్‌మెన్‌లు 255 మందికి నెలకు రూ.6 వేలు లెక్కన రూ.15.30 లక్షలు వేతనం రావాలి. ఈ లెక్కన 3 నెలలకు రూ.45.90 లక్షలు రావాల్సి ఉంది. మే, జూన్ నెలలకు రూ.3 వేలు లెక్కన 2 నెలలకు రూ.15.30 లక్షలు రావాల్సి ఉంది. మొత్తం 5 నెలలకు కలిపి రూ.61.20 లక్షలు వేతన బకాయిలు రావాల్సి ఉంది. ఆయాలు, వాచ్‌మెన్ల కలిపి మొత్తం రూ.7,05,84,000 వేతనాలు బకాయిలు ఉన్నాయి.
విద్యాశాఖలో చిరుద్యోగుల ఆకలి కేకలు
నెలకు రూ.6 వేలు. ఆ జీతం వస్తేనే ఆ ఇళ్లలో పొయ్యి వెలుగుతుంది. అయినా ఆ చిరుద్యోగుల కష్టాలు కూటమి సర్కారుకు కనిపించడం లేదు. ఐదు నెలలుగా జీతాల్లేవు. సర్కారు బడులను తెల్లవారుజామునే శుభ్రం చేసేది వాళ్లే. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేది వాళ్లే. రాత్రిళ్లు బడులకు కాపలా కాసేది వాళ్లే. కానీ వాళ్ల ఆకలి కేకలు మాత్రం పట్టడం లేదు. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న పెద్దలు కోట్ల రూపాయల నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ బడిని శుభ్రం చేసే చేతులకు నెలకు రావాల్సిన చిరు వేతనం కోసం ఐదు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో పాఠశాలల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆయాలు, వాచ్‌మెన్‌లకు సకాలంలో వేతనాలు అందేవి. ఇప్పుడు అదే వ్యవస్థలో ఐదు నెలలుగా జీతాలు నిలిచిపోవడంలో పాలకుల నిర్లక్ష్యం.. నిర్దయ స్పష్టంగా కనిపిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 2,686 మంది ఆయాలు, 255 మంది వాచ్‌మెన్లు
వీరికి నెలకు ఇచ్చేదే.. రూ. 6 వేల వేతనం
గత 5 నెలలుగా రూ.7.58 కోట్ల బకాయిలు పెండింగ్
తల్లికి వందనం నుంచి
రూ.58.28 కోట్ల మినహాయింపు
జీతాల కోసం ఎదురు చూపులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
ఠంఛన్‌గా జీతాలు
పెండింగ్ బకాయిలను త్వరలో చెల్లిస్తాం
ఆయాలు, వాచ్‌మెన్‌లు వేతనాలు ఈ ఏడాది మార్చి వరకు పూర్తిగా చెల్లించాం. ఏప్రిల్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి సంబంధించి నిధులు కూడా విడుదలయ్యాయి. ప్రస్తుతం బిల్లులు చేస్తున్నాం. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఆయాలు, వాచ్‌మెన్‌లకు చెల్లిస్తాం.
– ఆర్. బాలాజీరావు, డీఈఓ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకంలో ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేలు మినహాయిస్తున్నారంటూ దుష్ప్రచారం చేసిన కూటమి పెద్దలు.. తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని.. చివరకు తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది నుంచి అమలు చేసినా.. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేలు మినహాయించారు. ఈ మేరకు జిల్లాలో ఈ ఏడాది 2,91,383 మందికి తల్లికి వందనం జమ చేసింది. ఈ లెక్కన విద్యార్థుల నుంచి మినహాయించిన మొత్తం రూ.58,27,6,6000 ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంది. పాఠశాలల ఖాతాల్లో జమ చేయలేదు. ఈ మొత్తాన్ని జమ చేసినా.. వాచ్‌మెన్లు, ఆయాలకు పెండింగ్ వేతనాలు ఇవ్వడంతోపాటు ప్రతి నెల ఠంఛన్‌గా జీతాలు ఇచ్చేందుకు వెసులుబాటు ఉండేది.


