● టీడీపీ అరాచకాలను ఎదుర్కొందాం
● సర్వేపల్లిలో సర్వం దోపిడీ
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: టీడీపీ అరాచకాలను ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పొదలకూరు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లో గురువారం పర్యటించిన ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి చోట బరిలో దిగి విజయం సాధించాలని పేర్కొన్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలో కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరం ఒక్కతాటిపై నిలిచి పార్టీని విజయ తీరాలవైపు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రజల్లో పరపతిని కూటమి ప్రభుత్వం కోల్పోవడంతో పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు తెగబడే అవకాశముందని చెప్పారు. పార్టీ సత్తా ఏమిటో చూపిద్దామని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా కృషి చేద్దామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మినహా కూటమి పాలనలో ఎలాంటి డెవలప్‌మెంట్ జరగలేదని ఆరోపించారు. శాసనసభ ఎన్నికలెప్పుడొచ్చినా చంద్రబాబును సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
పంచభూతాల దోపిడీ
సర్వేపల్లి నియోజకవర్గంలో పంచభూతాలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సీఎస్సార్ నిధుల్లోనూ ఇదే పర్వాన్ని సాగిస్తున్నారని మండిపడ్డారు. కంపెనీలను సోమిరెడ్డి బెదిరించి పిల్లల సైకిళ్లు, సోలార్ లైట్ల పేరుతో దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ముత్తుకూరులో ట్యాంకర్‌కు రూ.600 చొప్పున నిత్యం 113 ట్యాంకర్లతో ఒక్కోటి ఐదు ట్రిప్పుల మేర నీటిని కంపెనీలకు అమ్ముతున్నారని ఆరోపించారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా, ఇళ్ల మధ్యలో బోర్లేసి తోడుకుంటూ ఈ పర్వాన్ని సాగిస్తున్నారని దుయ్యబట్టారు. మంచినీటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా, సోమిరెడ్డి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అక్కంగారి శివ గృహప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం వేణు, కావ్య.. గణేష్, సుమలత.. సునీల్, శైలజ వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కేతు రామిరెడ్డి, లెక్కల పెంచలనాయుడు, సుందరయ్య, వెంకటశేషయ్య, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీపీ సుగుణ తదితరులు పాల్గొన్నారు.


