నెల్లూరు (క్రైమ్): కాలువపై కల్వర్టు నిర్మాణానికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు రైతు వద్ద నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా సోమశిల ప్రాజెక్ట్ ఈఈ, డీఈ, ఏఈలను గురువారం రాత్రి నెల్లూరు అవినీతి నిరోధకశాఖ వలపన్ని పట్టుకుంది. వీరితోపాటు మరో ప్రైవేట్ వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు వివరాల మేరకు... కలువాయి మండలం కనుపూరుపల్లికి చెందిన రైతు ఎ. చిరంజీవి మరికొందరుతో కలిసి తన పొలంలో రైతులకు ఉపయోగపడే ధాన్యం ఆరబెట్టే యంత్రం (ప్యాడీ డ్రైయింగ్) ఏర్పాటు చేసుకునేందుకు నుడా అధికారులను సంప్రదించారు. అయితే పొలానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో మధ్యలో సోమశిల ప్రాజెక్ట్‌కు చెందిన పది అడుగల వెడల్పు కాలువ ఉండడంతో నుడా అధికారులు అంగీకరించలేదు. దీంతో ప్రాజెక్ట్ అధికారుల ఎన్‌ఓసీ తీసుకురావాలని సూచించారు. దీంతో చిరంజీవి సోమశిల ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఈఈ పి. మహేష్, డీఈ గౌతమ్ సుమన్, ఏఈ ఎం. నారాయణరాజులను సంప్రదించారు. వారు కాలువపై కల్వర్టు నిర్మాణానికి ఎన్‌ఓసీ కావాలంటే రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని చిరంజీవి ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు ఆయన గురువారం రాత్రి డైకస్‌రోడ్డు సమీప తెలుగుగంగ కాలనీ ఆవరణలోని ఈఈ కార్యాలయంలో అధికారులకు లంచంగా నగదు ఇస్తుండగా వలపన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఈఈను కాపాడేందుకు లంచం డబ్బులు అక్కడే ఉన్న కాంట్రాక్టర్ మాధ వ్ దాచి పెట్టేందుకు యత్నించగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లలో మూడు బృందాలతో సోదా లు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్, రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కల్వర్టు నిర్మాణానికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు రూ.4 లక్షలు డిమాండ్
రూ.3 లక్షలకు కుదిరిన ఒప్పందం
లంచం తీసుకుంటుండగా
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వైనం


