కోవూరు: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా జరగాలి. అక్రమాలకు తావిస్తే సహించేది లేదు. అధికార యంత్రాంగం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరులోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజల మద్దతు లభించడం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉన్న తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ అధికారులు తమ బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచించారు. కొందరు పోలీస్ అధికారులు తమ పార్టీ నాయకులకు ఫోన్లు చేసి మీరు ఎన్నికల్లో పోటీ చేయొద్దు, మీపై రౌడీషీట్ తెరుస్తామని బెదిరించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఇతర సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో వైఎస్సార్‌సీపీదే విజయం
జిల్లాలో మండల పరిషత్‌లు, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగిస్తుందని ప్రసన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు తమకు ఉందన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8 నుంచి 11వ తేదీలోపు ఒకరోజు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. 12 నుంచి 22వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా అన్ని వర్గాలు సహకరించాలని కోరారు.
● డీసీఎంఎస్ మాజీ చైర్మన్, సర్వేపల్లి పరిశీలకుడు వీరి చలపతిరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కేడర్‌ను సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, మండల క న్వీనర్లు అనూప్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, షాహుల్, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
మాజీ మంత్రి నల్లపరెడ్డి
ప్రసన్నకుమార్‌రెడ్డి


