బాధితులకు నష్టపరిహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు నష్టపరిహారం అందించాలి

Aug 28 2026 12:03 AM | Updated on Aug 28 2026 12:03 AM

కావలి రూరల్‌: తుమ్మలపెంట రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించడంతోపాటు నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుమ్మలపెంటలో చాలా కాలంగా దుకాణాలు నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతున్న అనేక కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. కొందరు 40 – 50 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. ప్రాంత అభివృద్ధి, రహదారుల విస్తరణ అవసరమేనని, ప్రజలకు మెరుగైన రహదారులు అందుబాటులోకి రావాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. అయితే దుకాణాలు, ఇళ్లను తొలగించే ముందు బాధితులకు ముందస్తు సమాచారం ఇచ్చి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అకస్మాత్తుగా యంత్రాలను తీసుకొచ్చి నిర్మాణాలను తొలగించడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు.

స్థలాలు కేటాయించాలి

బాధితులు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను వ్యతిరేకించడం లేదని రామిరెడ్డి స్పష్టం చేశారు. తమ దుకాణాలు, ఇళ్లు తొలగించాల్సి వస్తే.. ప్రత్యామ్నాయంగా ప్రధాన రహదారి వెంట స్థలాలు కేటాయించాలని కోరుతున్నారని తెలిపారు. దుకాణాలను తిరిగి నిర్మించుకునేందుకు కొంత నష్టపరిహారం అందించాలని మాత్రమే కోరుతున్నారని చెప్పారు. తుమ్మలపెంట ప్రాంతంలో రోడ్డు పక్కన ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, వాటిని బాధితుల జీవనోపాధికి వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన వ్యాపారులకు తక్షణమే పరిహారం అందించడంతో పాటు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే వైఎస్సార్‌సీపీ వారి తరఫున అండగా నిలిచి పోరాడుతుందని తెలిపారు.

● అన్నగారిపాళెంలో శ్రీకృష్ణ యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరుగుంటమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రామిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ సన్నీబోయిన ప్రసాద్‌యాదవ్‌, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణాల తొలగింపు సరికాదు

కావలి మాజీ ఎమ్మెల్యే

రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement