● శంఖవరంలో ఉద్రిక్తత
● వైఎస్సార్‌సీపీ వర్గీయులే టార్గెట్
● గ్రామస్తుల ఆందోళన
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలంలోని శంఖవరం గ్రామానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ వాగు పోరంబోకు భూముల్లో ఆక్రమణల తొలగింపులో అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. సర్వే నంబర్ 167, 169లో ఉన్న వాగు పోరంబోకు భూమి గ్రామంలో అంతర్భాగంగా ఉంది. మొత్తం 66 ఎకరాలు ఆక్రమణకు గురికాగా అందులో 65 ఎకరాలు టీడీపీ నేతల చేతుల్లో ఉన్నాయి. ఆ భూముల్లో పక్కాఇళ్లు నిర్మించుకుని వ్యవసాయం చేస్తున్నారు. మిగిలిన ఒక ఎకరాలో చిన్న, సన్నకారు పాడిరైతులు గడ్డివాములు, పేడదిబ్బలు, పశువుల షెడ్లు వేసుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తుల మధ్య నెలకొన్న విభేదాలతో ఆక్రమణలు తొలగించాలని అధికారులకు ఇరు వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కొంతమందికి ఆక్రమణలు తొలగించాలని మూడేళ్ల క్రితం నోటీసులు జారీ చేశారు. కానీ ఆ ప్రక్రియ జరగలేదు.
న్యాయం కాదు
గురువారం ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు గ్రామానికి చేరుకుని ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేశారు. అందరివి తీసేయాలని, కేలవం వైఎస్సార్‌సీపీ వర్గీయులవే తొలగించడం న్యాయం కాదని అధికారులను నిలదీశారు. కాగా టీడీపీ వర్గీయులు తీసేయాల్సిందేనంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్సై ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుని రెండువర్గాలను హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గ్రామస్తులు వారం రోజుల సమయం అడగడంతో అధికారులు అంగీకరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డీఈ టి.రమణారావు మాట్లాడుతూ వాగు పోరంబోకులో ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.


