రైలు పట్టాలపై మరణ మృదంగం | - | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై మరణ మృదంగం

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

కొన్ని..

నెల్లూరు(క్రైమ్‌): రైలు పట్టాలపై మరణ మృదంగం వినిపిస్తోంది. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ప్రయాణికుల నిర్లక్ష్యం, అప్రమత్తత లోపం కారణంగా నిండుప్రాణాలు రైలు చక్రాల కింద నలిగిపోతున్నాయి. నెల్లూరు రైల్వే సర్కిల్‌ పరిధిలో తెట్టు నుంచి సూళ్లూరుపేట వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర రైల్వే మార్గం విస్తరించి ఉంది. ఈ పరిధిలో కావలి, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లతో పాటు బిట్రగుంట, సూళ్లూరుపేట, కృష్ణపట్నం పోర్టులో అవుట్‌పోస్టులు ఉన్నాయి. ఈ మార్గంలో రోజుకు సుమారు 120 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.

ఒక నెలలో..

పట్టాలు దాటుతూ, రైల్లోంచి ప్రమాదవశాత్తు జారిపడి కింద పడుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా ఉంది. నెలకు సగటున 22 మంది రైలు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి, పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని సుమారు 117 మంది మృతిచెందారు. వివిధ కారణాలతో 61 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

కొన ఊపిరితో ఉన్నా.. కాపాడలేని పరిస్థితి

రోడ్డుపై ప్రమాదం జరిగితే ఘటనను చూసిన ప్రజలు వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేసేందుకు పరుగులు తీస్తారు. అయితే రైలు పట్టాలపై జరిగే ప్రమాదాలు చాలాసార్లు ఎవరి కంటా పడవు. దీంతో వ్యక్తి కొన ఊపిరితో ఉన్నా సకాలంలో వైద్యం అందని పరిస్థితి నెలకొంటోంది. పట్టాలపై జరిగే ప్రమాదాలు చాలా సందర్భాల్లో ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. లోకో పైలట్లు, కీమెన్‌లు, ట్రాక్‌మెన్‌లు ప్రమాదాన్ని గుర్తించి స్టేషన్‌ మాస్టర్‌ దృష్టికి తీసుకెళ్తే ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందిస్తారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేస్తారు. అయితే లోకో పైలట్లు, కీమెన్‌లు, ట్రాక్‌మెన్‌లకు ప్రమాదం కనిపించకపోతే పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురైన వారికి సకాలంలో వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుంది. కానీ జనసంచారం లేని ప్రాంతాల్లో తీవ్రంగా గాయపడిన వారు కొన ఊపిరితో ఉన్నా సాయం అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

మృతదేహాల గుర్తింపు కష్టతరం

రైలు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని గుర్తించడం రైల్వే పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. మృతుల్లో అధికశాతం మంది ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం ఒక కారణమైతే.. వారి వద్ద సెల్‌ఫోన్‌, ఆధార్‌కార్డు వంటి గుర్తింపు పత్రాలు లేకపోవడం మరో సమస్యగా మారుతోంది. ప్రమాద తీవ్రతతో మృతదేహాలు ఛిద్రమవడం కూడా గుర్తింపును మరింత కష్టతరం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో మృతదేహాలు పట్టాల పక్కనే ఉన్న ముళ్లపొదలు, పిచ్చిమొక్కల మధ్య పడిపోవడంతో రోజుల తరబడి గుర్తించలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో మృతదేహాల గుర్తింపు, తరలింపు మరింత కష్టతరమవుతోంది. సొంత కుటుంబ సభ్యులైనా గుర్తుపట్టలేని దుస్థితి ఏర్పడుతోంది. నిబంధనల ప్రకారం గుర్తుతెలియని మృతదేహాలను 72 గంటలు (మూడు రోజులు) పాటు మార్చురీలో భద్రపరచాలి. ఆ సమయంలో మృతుడి సంబంధీకులు ఎవరూ రాకపోతే రైల్వే పోలీసులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మృతుడి వివరాలు, ఆచూకీ కోసం పోలీసులు వివిధ మార్గాల్లో ప్రయత్నించాల్సి ఉంటుంది.

నిర్లక్ష్యమే ప్రధాన కారణం

రైలు ప్రమాదాల్లో అధికశాతం ఘటనలకు ప్రయాణికుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. కదులుతున్న ట్రైన్‌లో ఎక్కడం, దిగడం, ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం, తలుపు వద్ద కూర్చోవడం, అటూఇటూ గమనించకుండా పట్టాలు దాటడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించడం, రైలు ప్రయాణ సమయంలో సెల్‌ఫోన్‌ ఉపయోగిస్తూ అప్రమత్తత కోల్పోవడం వంటి చర్యలు కూడా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రైల్వే అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో నిర్లక్ష్య వైఖరి మారడం లేదు. నిబంధనలు పాటిస్తేనే ఇలాంటి విషాదాలను నివారించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటే నిండు ప్రాణాలను కాపాడుకోవచ్చని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

నెలకు సగటున 22 మంది మృతి

నిర్లక్ష్యం.. అప్రమత్తత లోపంతో

నిండుప్రాణాలు బలి

మృతదేహాల గుర్తింపు

రైల్వే పోలీసులకు సవాల్‌

నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని 50 ఏళ్ల వృద్ధుడు ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు.

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు.

ఇలాంటి ఘటనలు నెల్లూరు రైల్వే పరిధిలో తరచూ చోటుచేసుకుంటుండటంతో పట్టాలు మృత్యుమార్గాలుగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అవగాహన కల్పిస్తున్నాం

కదులుతున్న రైల్లో ఎక్కడం, దిగడం చేయరాదు. ఫుట్‌బోర్డులపై నిలబడి, తలుపుల వద్ద కూర్చొని ప్రయాణించరాదు. పట్టాలు దాటాల్సి వచ్చినప్పుడు ముందు, వెనుక చూసుకోవాలి. మలుపుల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలి. రైల్వేస్టేషన్లలో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలను మాత్రమే వినియోగించాలి. రైలు ప్రమాదాల నివారణ చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం.

– ఎ.సుధాకర్‌, రైల్వే సీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement