ప్రేమ విఫలమైందని.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమైందని..

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

యువకుడి ఆత్మహత్యపై పోలీసుల విచారణ

వెలుగులోకి సెల్ఫీ వీడియో

వెంకటాచలం: ప్రేమ విఫలమవడంతోనే వెంకటాచలం పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి చెందిన శివకుమార్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. శివకుమార్‌ కాలనీలో తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు శివకుమార్‌ ఫోన్‌ను పరిశీలించగా, ఓ యువతి తనను నమ్మించి మోసం చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో బయటపడింది. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేశారు.

అప్పులబాధ తాళలేక..

యువకుడి ఆత్మహత్య

నెల్లూరు(క్రైమ్‌): అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బాలాజీ నగర్‌ వైకే ఆచారి వీధికి చెందిన మణికంఠ (29) అవివాహితుడు. అతను చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు సమీపంలో తోపుడు బండిపై పుల్కాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్నేహితులు, తెలిసిన వారి వద్ద రూ.లక్షల్లో అప్పులు చేశాడు. వారి ఒత్తిడి అధికమవడంతో కొంతకాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. అప్పుల బాధలు తాళలేక బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు బాలాజీనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

లేస్‌ ప్యాకెట్‌ అడిగి..

మెడలో సరుడు లాక్కెళ్లారు

పొదలకూరు: లేస్‌ ప్యాకెట్‌ అడిగారు.. అంగట్లో మహిళ తీసిచ్చేలోపు ఆమె మెడలో బంగారు సరుడు లాక్కెళ్లాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో బాధితురాలు అయోమయానికి గురై తేరుకునే లోగానే బైక్‌పై దుండగులు పరారైన ఘటన మండలంలోని మర్రిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మర్రిపల్లి గ్రామం రాపూరు – పొదలకూరు మెయిన్‌రోడ్డు పక్కన రమాదేవి దుకాణం పెట్టుకుని జీవిస్తోంది. ఆమె వద్దకు ఇద్దరు యువకులు మోటార్‌బైక్‌పై వచ్చారు. వారిలో ఒకతను బైక్‌ను ఆపకుండా రోడ్డుపైనే ఉండగా మరొకడు వచ్చి సిగరెట్లు, వాటర్‌ ప్యాకెట్లు అడిగి తీసుకున్నాడు. అవి తీసుకున్న తర్వాత లేస్‌ ప్యాకెట్‌ అడిగాడు. అది తీసిచ్చేలోగా ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును లాక్కుని బైక్‌పై పరారయ్యారు. మహిళ కేకలు వేసి వెంటనే నిందితుల కోసం గాలించినా ఫలితం దక్కలేదు. బంగారు సరుడు విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. పొదలకూరు సీఐ వెంకట్రావు, ఎస్సై శివరాకేష్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు.

సంపులో మృతదేహం

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

చిల్లకూరు: భవన నిర్మాణ పనులకు వెళ్లి కూలీ సంపులో మృతదేహంగా కనిపించడం పట్టణంలో కలకలం రేపింది. సీఐ శేఖర్‌బాబు, ఎస్సై మనోజ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. వారి కథనం మేరకు.. గూడూరులోని జాండ్ర వీధికి చెందిన ఆలూరు రమణయ్య (50) భవన నిర్మాణ పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతను మంగళవారం పట్టణంలోని న్యూ బాలాజీ కాలనీలో పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మేస్త్రికి ఫోన్‌ చేయగా రమణయ్య పనులు ముగించుకుని ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు. రాత్రంతా అతడి కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి చూశారు. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న సంపులో రమణయ్య మృతిచెంది ఉన్నాడు. దీంతో బాధిత కుటుంబం అనుమనాలు వ్యక్తం చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు.

కండలేరులో

20.55 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 20.55 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్‌ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, హైలెవల్‌ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.125

సన్నవి : రూ.60

పండ్లు : రూ.30

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement