● కావలి మాజీ ఎమ్మెల్యే
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి: ఎంతో ఉన్నతాశయంతో ప్రజారోగ్యం కోసం ప్రారంభించి పనులు చేపట్టిన సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ప్రభుత్వం అర్ధాంతరంగా మరుగున పడేసిందని వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో ఆయన బుధవారం పర్యటించారు. వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికి సమస్యలను వెల్లడించారు. రామిరెడ్డి ఎస్‌టీవీ ప్లాంట్ వద్దకు వెళ్లి తుప్పు పడుతున్న మెషినరీని, బావిలో రంగుమారిన నీటిని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్ర ముగ్గురం చర్చించుకుని ప్లాంట్‌కు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. పనులు ప్రారంభించగా, నిధుల కొరత వల్ల కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ కాంట్రాక్టర్ కొనసాగించారని గుర్తుచేశారు. 2019లో తాను తిరిగి ఎమ్మెల్యే అయ్యాక మెషినరీ, స్ట్రక్చర్ వంటివి పూర్తిచేశామని తెలిపారు. ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినా ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మెషినరీ పాడయ్యే దశ కనిపిస్తోందన్నారు. నా మీదనో, బీద సోదరుల మీద కోపంతోనే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పర్యావరణ పరిరక్షణకు ప్రారంభించిన మంచి ప్రాజెక్ట్ మూలనపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎందుకు బాధ?
ప్రశ్నిస్తే టీడీపీ నేతలకు ఎనలేని బాధ పుడుతోందని, ఎందుకంటే వారి హయాంలో ఇప్పటి వరకు కొత్తవేమి మంజూరు చేయలేదని రామిరెడ్డి ఎద్దేవా చేశారు. చిన్నవి చేసి అదేదో బ్రహ్మాండంగా చేసినట్లుగా చెప్పడం వారికి అలవాటైపోయిందన్నారు. దీనికి మందాడి చెరువును ఆనుకుని ఇటీవల పూర్తిచేసిన పార్కు ఉదాహరణ అని చెప్పారు. ఆ పార్కుకు సంబంధించి మంజూరు నుంచి పనులన్నీ తమ హయాంలో చేశామని గుర్తుచేశారు. కట్ట వెడల్పు పనులు, నుడాలో రూ.1.4 కోట్ల నిధులు మంజూరు చేయించి పార్కుకు సంబంధించి లెవలింగ్ పూర్తి చేశామని వివరించారు. ప్రస్తుతం వారు మిగిలిన పనులు మాత్రమే పూర్తి చేశారని, ఈక్రమంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న విమర్శలు ఉన్నాయన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని, వెలికితీసి దోషులుగా నిలబెడతామని, ఎవరినీ వదలమని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ అధికారులను కూడా అడుగుతామని స్పష్టం చేశారు. వరవ కాలువ పైనుంచి కింద వరకు తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని, అలాగే చెత్తాచెదారం ఉందని, దీంతో 11, 12, 13 వార్డులు, కొంత భాగం 10 వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిపై తక్షణమే మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, ఆయా వార్డుల ఇన్‌చార్జిలు అక్కిలగుంట మాల్యాద్రి, చేవూరి కిరణ్‌కుమార్, శ్యామ్‌సన్, దంతం సునీల్‌కుమార్, కుందుర్తి కామయ్య, ఆత్మకూరి రాజేష్, గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు ప్రసాద్‌రెడ్డి, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


