జూడాల ఆందోళన.. పట్టించుకోని ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

జూడాల ఆందోళన.. పట్టించుకోని ప్రభుత్వం

Aug 26 2026 12:00 AM | Updated on Aug 26 2026 12:00 AM

స్టై పెండ్‌ సవరించాలని డిమాండ్‌

నర్సింగ్‌ విద్యార్థులతోనే వైద్య సేవలు

అర్హత లేని ఫార్మడీ ఇంటర్న్‌లతో చికిత్స

అరకొర వైద్య సేవలతో రోగుల అవస్థలు

నెల్లూరు(అర్బన్‌): న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు 16 రోజులుగా వైద్య సేవలకు దూరంగా ఉంటూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు హనీష్‌కుమార్‌ మాట్లాడుతూ 16 రోజులుగా తాము వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్టై పెండ్‌ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓలను సైతం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. తాము ఏడాది కాలంగా వినతిపత్రాలు సమర్పిస్తూ, మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి స్టై పెండ్‌ను సవరించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె బాట పట్టాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమకు న్యాయమైన స్టై పెండ్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు. వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచరాదని కోరారు. జూనియర్‌ డాక్టర్లకు ప్రభుత్వ వైద్యులుగా అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్‌, పీజీ చేసిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతోనే పాఠాలు బోధించాలని కోరారు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ చేసిన వారితో బోధన చేయిస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం న్యాయం చేయకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కావ్య, కీర్తి, షాలిని, సుగుణ, స్వామి, మధు, సుజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

వారితోనే సేవలంటూ..

జూనియర్‌ డాక్టర్లు సాధారణంగా ఐసీయూ, క్యాజువాలిటీ (ఎమర్జెన్సీ) విభాగాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తుంటారు. గాయాలకు కట్లు కట్టడం, ఇంజెక్షన్లు వేయడం, చేతికి క్యానులా పెట్టడం వంటివి చేస్తారు. సీనియర్‌ డాక్టర్ల సూచనల మేరకు ఆయాసం, ఇతర చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు వైద్యం చేస్తుంటారు. అయితే జూడాల సమ్మె కారణంగా ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది. క్యాజువాలిటీ వంటి కీలక విభాగాల్లో ప్రస్తుతం మొదటి సంవత్సరం నర్సింగ్‌ విద్యార్థులతో ఇంజెక్షన్లు వేయించడం, ఈసీజీ తీయించడం వంటి పనులు చేస్తున్నారు.

● ఫార్మడీ కోర్సు చదువుతున్న ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు శిక్షణలో భాగంగా ఇంటర్న్‌షిప్‌ కోసం సర్వజన ఆస్పత్రికి వచ్చారు. వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించే అర్హత లేదు. అయినప్పటికీ సమ్మె నేపథ్యంలో ఫార్మడీ ఇంటర్న్‌లతో రోగులకు చికిత్సలు చేయిస్తున్నారు. అర్హత, అనుభవం లేని వారితో వైద్య సేవలు అందించడం వల్ల ఏదైనా అనుకోని ఘటన జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెకు పరిష్కారం చూపడంతోపాటు ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement