● రైళ్లల్లో వరుస దొంగతనాలు
● అరెస్ట్ చేసి రూ.13.65 లక్షల
సొత్తు స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): చెడు వ్యసనాలకు బానిసై రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అన్నదమ్ములను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13.65 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఇటీవల రైళ్లల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. డీఎస్పీ నేతృత్వంలో సీఐ ఎ.సుధాకర్ తన సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచారు. గూడూరు బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు తాల్లూరు అనిల్‌కుమార్, సునీల్‌కుమార్, ఓ జువైనల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మూడు బ్యాగ్ దొంగతనాలు, ఐదు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.13.65 లక్షల విలువైన 104.248 గ్రాముల బంగారు ఆభరణాలు, 180 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
డబ్బు కోసం..
నిందితులు చిన్నతనం నుంచే చెడు వ్యసనాలకు బానిసై వాటి కోసం డబ్బు సమకూర్చుకునేందుకు దొంగతనాలకు పాల్పడసాగారు. రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల బ్యాగ్‌లు, బంగారు గొలుసులను అపహరించసాగారు.. వీరిపై ఇప్పటికే బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్‌స్టేషన్, గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషి చేసిన సీఐ ఎ.సుధాకర్, గూడూరు, నెల్లూరు ఎస్సైలు ఎం.నారాయణ, ఎన్.హరిచందన, సిబ్బందిని డీఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ సూచించారు.


