● వైఆర్‌జేసీ స్వర్ణోత్సవ సభలో
వెంకయ్యనాయుడు
వింజమూరు(ఉదయగిరి): విద్యార్థుల్లో చిన్నతనం నుంచే జాతీయ భావాన్ని పెంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హితవు పలికారు. వింజమూరులో మంగళవారం జరిగిన వైఆర్‌జేసీ స్వర్ణోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మాతృభాషను తప్పనిసరిగా, అలాగే ఇంగ్లిష్, హిందీని కూడా అందరూ నేర్చుకోవాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, భారతీయ సంస్కృతిని మరిచిపోకూడదన్నారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం గౌరవం పెరిగిందన్నారు. ప్రపంచ దేశాల్లో ఒక శక్తిగా మారిందన్నారు. పాలకులు ప్రజలకు అన్నీ ఉచితాలు ఇవ్వకూడదన్నారు. విద్య, ఆరోగ్యం, ఆహారానికి ఉచిత పథకాలు అమలు చేయాలన్నారు. 1975 ప్రాంతంలో ఉదయగిరి, వింజమూరు మెట్ట ప్రాంతంలో ఉన్నత చదువుకు వైఆర్‌జేసీ కాజేజీ ఏర్పాటు చేసి, దాని ద్వారా ఎంతోమంది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన రాజాసత్యనారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్వర్ణోత్సవాలు జరుపుకోవడం చిన్న విషయం కాదన్నారు. రూ.కోటి కార్పస్ ఫండ్ వసూలు చేసి తద్వారా వచ్చిన వడ్డీతో స్టాఫ్‌ను పెట్టి మంచి విద్యను అందించేందుకు అందరూ సహకరించాలన్నారు. నేడు మన రాష్ట్రంతోపాటు, తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని హితవు పలికారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి లోకానికి వెంకయ్యనాయుడు రోల్ మోడల్‌గా అభివర్ణించారు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేసే తత్వం తమదన్నారు. కాలేజీకి వెంకయ్య రూ.5 లక్షలు, వేమిరెడ్డి రూ.10 లక్షలు ఆర్థిక సహయం ప్రకటించారు. అంతకుముందు మాజీ ఉప రాష్ట్రపతి రాజాసత్యనాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆర్‌ఐఓ వరప్రసాద్‌రావు, ప్రొఫెసర్ యల్లాల వెంకట్రామిరెడ్డి, కె.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


