● ఏఎన్‌ఎం ప్రమోషన్ రెగ్యులరైజేషన్ కోసం రూ.2500 వసూలు
● హెల్త్ అసిస్టెంట్ నుంచి
రూ.మూడు వేలు
● నాలుగు నెలలుగా ముందుకు
కదలని ఫైళ్లు
● సిండికేట్‌గా మారి
పంచుకుంటున్న వైనం
● వైద్యశాఖలో ఇదీ దుస్థితి
నెల్లూరు(అర్బన్): మితిమీరిన లంచాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కేరాఫ్‌గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. డాక్టర్ల సరెండర్ లీవులు, ఎర్న్‌డ్ లీవుల కు సైతం గతంలో ఇలానే వ్యవహరించారనే ఆ రోపణలు అప్పట్లోనే వచ్చాయి. తాజాగా సర్వీ స్ రెగ్యులరైజేషన్ కోసం ఫైళ్లు నడపకముందే ప్రమోషన్ పొందిన సచివాలయ ఏఎన్‌ఎంల నుంచి హెల్త్ అసిస్టెంట్ల వరకు లంచాలను అడ్డంగా వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముక్కుపిండి మరీ..
జిల్లాలో గతంలో పనిచేస్తున్న 294 మంది సచివాలయ గ్రేడ్ – 3 ఏఎన్‌ఎంలకు గ్రేడ్ – 2లుగా ఉద్యోగోన్నతులు కల్పించి వైద్యశాఖలో విలీనం చేశారు. వాస్తవానికి ఏ క్యాడర్‌లో ఉన్న వ్యక్తికై నా ప్రమోషన్ కల్పిస్తే ఏడాది తర్వాత వారి సర్వీస్‌ను జిల్లా వైద్యశాఖ క్రమద్ధీకరించాలి. దీన్ని సకాలంలో చేస్తేనే ఇంక్రిమెంట్ సైతం వస్తుంది. దీనికి గానూ ఏఎన్‌ఎం పనిచేస్తున్న పీహెచ్‌సీ నుంచి ఎస్సార్, ఇతర వివరాలతో కూడిన దరఖాస్తును స్వీకరించి ఫైల్‌ను వైద్యశాఖ క్లర్కు నడపాలి. ఇలా జిల్లాలో ఉద్యోగోన్నతి పొందిన సచివాలయ ఏఎన్‌ఎంలకు మార్చితో సంవత్సరం పూర్తయింది. అయితే నాలుగు నెలలుగా దరఖాస్తులను స్వీకరించకుండా ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు ఫైల్‌ను నడపకముందే సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు గానూ ఒక్కొక్కరూ రూ 2500 వరకు ఇచ్చుకోవాలని చెప్పి ఇప్పటికే ఎక్కువ శాతం మంది నుంచి వసూలు చేశారు. మిగిలిన వారు సైతం ఇస్తేనే అందరి సర్వీస్ ఫైల్ ఒకేసారి ముందుకు కదులుతుందని, లేని పక్షంలో ఆలస్యం చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. ఇలా 294 మంది నుంచి వసూలు చేసిన మొత్తం అక్షరాలా రూ.7.35 లక్షలు.
హెల్త్ అసిస్టెంట్ల పరిస్థితీ ఇంతే..
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 112 మంది హెల్త్ అసిస్టెంట్లు గతేడాది రెగ్యులరయ్యారు. వీరికి సైతం సంవత్సరం గడువు ముగిసింది. సర్వీస్ ఫైల్‌ను ముందుకు నడపాల్సి ఉండగా, వైద్యశాఖలో రూ.మూడు వేల చొప్పున ముందుగానే వసూలు చేస్తున్నారనే విమర్శలు జోరందుకున్నాయి. ఇలా వీరందరి నుంచి వసూలు చేస్తే రూ.3.36 లక్షలవుతుంది.
కాళ్లరిగేలా తిరుగుతూ..
ముందుగా లంచాలిచ్చిన ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు తమ సర్వీస్ రెగ్యులరైజేషన్ ఫైల్‌ను పెట్టాలని కోరుతూ సంబంధిత సెక్షన్ సిబ్బంది చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దీనిపై వైద్యశాఖలోని యూనియన్ నేతల వద్ద తమ గోడును పలువురు వెళ్లబోసుకున్నారు.
వేళ్లన్నీ ఆ సీటువైపే..
సర్వీస్ క్రమబద్ధీకరణ పేరుతో లంచాలకు ఓ సీనియర్ అసిస్టెంట్ తెరలేపారని తెలుస్తోంది. తమను డిమాండ్ చేసి మరీ డబ్బులు వసూలు చేశారని ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు పేర్కొంటున్నారు. ఇందులో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వాటాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఫైళ్లు నడిపి చేతికి ఆర్డర్ ఇచ్చాక.. ఏఎన్‌ఎం లేదా ఇతర సిబ్బంది మనస్ఫూర్తిగా రూ.500ను క్లర్క్ చేతిలో పెట్టేవారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ముందుగానే లంచాన్ని ఫిక్స్ చేసి సిండికేట్‌గా ఏర్పడి వసూలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా పాలనాధికారులు స్పందించి పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతున్నారు.


