దుశ్శాసనపర్వంపై డీఎస్పీ విచారణ | - | Sakshi
Sakshi News home page

దుశ్శాసనపర్వంపై డీఎస్పీ విచారణ

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

కావలి: జిల్లాలో సంచలనం రేపిన కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో ఒంటరి గిరిజన మహిళను టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్‌ ఇబ్రహీం, ఆయన అనుచరులు కలిసి వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్‌ శనివారం విచారణ చేపట్టారు. ఆ మహిళ కుమారుడి ప్రేమ వ్యవహారంలో యువతి బంధువర్గం ఆమెను ఒంటరిగా ఉన్న సమయంలో రాత్రి వేళ దాడి చేయడమే కాకుండా వివస్త్రను చేసి, కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు డీఎస్పీ నేరస్థలాన్ని పరిశీలించి, బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. చుట్టు పక్కల నివాసాల వారిని కూడా విచారించారు. అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గత నెల 19న బాధితురాలిపై ఘటన జరిగినప్పటికీ.. వివిధ కారణాలతో అదే నెల 26వ తేదీ కేసు నమోదు చేశారన్నారు. అయితే నెల్లూరులో రొట్టెల పండగ నేపథ్యంలో బందోబస్తు డ్యూటీలో ఉండడం, సీఎం పర్యటనలతో వరుస కార్యక్రమాల నేపథ్యంలో సకాలంలో విచారణ చేపట్టలేకపోయామన్నారు. శుక్రవారం విచారించేందుకు వచ్చినప్పటికి బాధితురాలు వైద్య పరీక్షలకు వెళ్లడంతో అందుబాటులోలేకపోవడంతో శనివారం మరో మారు వచ్చి విచారించామన్నారు. అయితే నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఇప్పుడే విచారణ చేపట్టామని, నిజానిజాలు తెలుసుకున్న తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని డీఎస్పీ చెప్పారు.

ఎట్టకేలకు కదిలిన పోలీసులు

గిరిజన మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసి కొట్టిన ఘటనను పోలీసులు నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో శనివారం డీఎస్పీ విచారణ చేపట్టారు. ఈ దారుణం గత నెల 19వ తేదీ జరిగినా.. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు వారం రోజుల పాటు కేసు నమోదు చేయకుండా తొక్కిపెట్టారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఈ ఘటనపై ఎప్పుడైతే మీడియాకు వెల్లడించారో.. ఆ వెంటనే హడావుడిగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మీడియాల్లో కథనాలు రావడం, మహిళా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఈ ఘటనపై గళమెత్తడంతో ప్రజామద్దతు ఊపందుకుంది. అయితే గిరిజన మహిళపై జరిగిన అకృత్యాన్ని కొట్టిపారేందుకు ఆమె కులం, మతం పేరుతో కుట్రలకు పదును పెట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి రెండు సార్లు, ఎమ్మెల్సీ, మాజీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ గిరిజన సంఘ నాయకులు, ఆదివాసీ సంఘ నేతలు తరలిరావడం, తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఎట్టలకే పోలీసులు విచారణకు దిగారని, ఈ కేసును ఏమాత్రం తారుమారు చేసినా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement