పనులను త్వరగా పూర్తి చేయిస్తాం | - | Sakshi
Sakshi News home page

పనులను త్వరగా పూర్తి చేయిస్తాం

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

చిల్లకూరు: పాఠశాలల్లో చేపట్టిన నాడు–నేడు పనులు ఇంకా కొంతమేర నిలిచిపోయి ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతామని ఏపీ స్టేట్‌ పాఠశాలల మౌలిక వసతుల కల్పన డైరెక్టర్‌ మువ్వా రామలింగం అన్నారు. ఆయన చిల్లకూరు మండలంలోని నెలబల్లిరెట్టపల్లి గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ముందుగా అక్కడి విద్యార్థుల స్కిల్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో నాడు–నేడు పనుల్లో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని ఆలస్యమవుతున్నాయన్నారు. ప్రతి పాఠశాలలో నిలిచిపోయిన మౌలిక వసతుల కల్పనకు చెందిన నిధులను త్వరగా అందించి పనులు పూర్తి చేయిస్తామన్నారు. ఆయన వెంట ఎంఈఓ రవూఫ్‌, హెచ్‌ఎం విజయలక్ష్మి ఉన్నారు.

కారును ఢీకొన్న ట్రాక్టర్‌

ఒకరికి గాయాలు

కోట: కారును ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటన మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ప్రధాన రహదారిపై శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిట్టేడు వైపు కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్‌ బోల్తా పడడంతో కట్టెలన్నీ పడి ట్రాఫిక్‌ స్తంభించింది. కారులో ఉన్న రమేష్‌ అనే వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుపుతున్నట్లు ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు.

లేఅవుట్‌కు భారీగా

గ్రావెల్‌ తరలింపు

మైన్స్‌ ఆర్‌ఐ పరిశీలన

అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని సర్వే నంబర్లు 144/3బీ, 144/3సీ, 145/1ఏ, 145/2లో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్‌కు భారీ ఎత్తున గ్రావెల్‌ తరలిస్తున్నారనే సమాచారంతో మైన్స్‌ శాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మైన్స్‌ శాఖ ఆర్‌ఐ సీహెచ్‌ స్వాతి, స్థానిక వీఆర్వో కృష్ణప్రసాద్‌తో కలిసి లేఅవుట్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ సుమారు 35 టిప్పర్ల మేర గ్రావెల్‌ నిల్వలు ఉండటాన్ని గమనించి, వాటికి సంబంధించిన అనుమతులు, రికార్డులపై సంబంధిత వ్యక్తులను వివరణ కోరినట్లు తెలిసింది. లేఅవుట్‌ అభివృద్ధి పనులకు అవసరమైన రెవెన్యూ, మైన్స్‌, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ తదితర శాఖల అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. కాగా అక్రమాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు

నిలుపు నేడు

దుత్తలూరు: ప్రసిద్ధ వెంగమాంబ పేరంటాలు బ్రహోత్సవాల్లో భాగంగా అమ్మవారి పుట్టినిల్లు అయిన వడ్డిపాళెంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం తొలిరోజు నిలుపు, పసుపు దంచే కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు.

చెస్‌లో మెరిసిన

నెల్లూరీయులు

నెల్లూరు (టౌన్‌): మహారాష్ట్రలోని నాగపూర్‌లో గత నెల 30వ తేదీ నుంచి ఈనెల 4వ తేదీ వరకు నిర్వహించిన నేషనల్‌ అండర్‌–7 బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో నెల్లూరు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. రాయ్‌ చెస్‌ అకాడమీకి చెందిన వియాన్‌ కృష్ణ అండర్‌–7 విభాగంలో జాతీయస్థాయిలో నాలుగో స్థానం సాధించారు. బాలికల అండర్‌–7 విభాగంలో శ్రీహిత రొంపిచర్ల జాతీయ స్థాయిలో 13వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా శనివారం అకాడమీలో అబ్దుల్‌ అజీజ్‌, రమణబాబు, మౌనిక, విష్ణు, బషీర్‌, మహేంద్ర, షరీఫాలు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement