తమ్ముళ్లకే ఉపాధి హామీ | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకే ఉపాధి హామీ

Jul 5 2026 7:20 AM | Updated on Jul 5 2026 7:20 AM

వెంకటాచలం: మండలంలోని సర్వేపల్లి గ్రామంలో గత వైఎస్సార్‌సీపీ పాలనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవసరమైన పనులను ఎంపిక చేసి ప్రజలకు పని దినాలను కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను టీడీపీ నాయకులు తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కోర్టును ఆశ్రయించడంతో తొలగించే ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి గ్రామంలో ఉపాధి పనులు జరగలేదు. అయితే రెండు నెలల క్రితం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రమేయం లేకుండా మేట్‌ చేత ఉపాధి పనులు ప్రారంభించారు. ఈ పనులకు వాస్తవంగా కొద్ది మంది కూలీలు మాత్రమే హాజరయ్యారు. కానీ గ్రామంలోని 20 మందికి పైగా టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పేర్లను మస్తర్లలో చేర్చి ఉపాధి నిధులు వారి ఖాతాల్లో జమ చేశారు. నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేసే వ్యక్తి, అతని భార్య పనులకు హాజరు కాకపోయినా వారి ఇద్దరి ఖాతాల్లో ఉపాధి హామీ పథకం నగదును జమ చేశారు. అలాగే ప్రైవేటు ఫ్యాక్టరీలలో పనిచేసే వ్యక్తులు, వృద్ధాప్య పింఛన్‌ పొందుతూ మంచానికే పరిమితమైన వ్యక్తికి ఉపాధి నిధులు జమ చేశారు. ఈ విషయంపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వాస్తవాలను బయటకు తీసి రెండు రోజుల క్రితం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులకు, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గ్రామంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతికి పాల్పడినవారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వాళ్లకు ఉపాధి నగదు జమ

20 మందికి పైగా పేర్లతో

నిధుల స్వాహా

విచారణ జరపాలని అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు

అవినీతికి కాదేదీ అనర్హం అనట్లుగా మారిపోయింది కూటమి ప్రభుత్వ తీరు. ఇప్పటికే అక్రమ గ్రావెల్‌, ఇసుక, మట్టి తవ్వకాలతో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు సర్వం దోచుకుంటున్నారు. ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వారి అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండాపోతోంది. తాజాగా

వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టీడీపీ నాయకుల అవినీతి బాగోతం బయటపడింది.

విచారణ జరుపుతాం

ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై

ఏపీఓ వెంకటేశ్వర్లును వివరణ కోరగా సర్వేపల్లిలో పని చేయనివారికి ఉపాధి నిధులు జమ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఈవిషయంపై గ్రామానికి విచారణ జరుపుతామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement