దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
● రూ.20 లక్షల విలువైన
సొత్తు స్వాధీనం
కావలి: కావలిలోని పూనూరివారివీధిలో పేరూరి కల్పన అనే మహిళ నివాసంలో గత నెల 23వ తేదీ జరిగిన దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని డీఎస్పీ పి.శ్రీధర్ తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్దూరుపాడుకు చెందిన పాలేటి లక్ష్మణరావు, గట్టుపల్లివారివీధికి చెందిన దేవరకొండ ప్రేమ్‌కుమార్ (స్వగ్రామం బోగోలు మండలం ఏగులబావి) కోడిపందేలు, పేకాట, మద్యానికి బానిసయ్యారు. జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డారు. వీరిపై గతంలో పలు స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నాయి. వారి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి, ఇంకా ఒక మోటార్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకుని నగలను రికవరీ చేసిన కావలి వన్‌టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై సుమన్‌ను డీఎస్పీ అభినందించారు.
ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదు
కోవూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి వడ్డే సంపూర్ణమ్మ అన్నారు. ఆదివారం కోవూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. గుమ్మళ్లదిబ్బకు చెందిన బాలికకు జరిగిన అన్యాయంపై బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా నిలబడటమే కాకాణి చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఆయనకు నోటీసులిచ్చి విచారణకు పిలవడం రాజకీయం కాదా అని నిలదీశారు. ఫిబ్రవరి 27న విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడిన కాకాణి ఎక్కడా టీడీపీ నేత పేరును ప్రస్తావించలేదని ఆమె గుర్తుచేశారు. నియోజకవర్గంలో మహిళల సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థి పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. కాకాణి కుమార్తె పూజిత గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి అపారమైన ప్రజా బలం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని చెబితే భయం ఎందుకు?, అహంకారంతో మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. యేడెం లక్ష్మీకుమారి, జెడ్పీటీసీ సభ్యురాలు కవరగిరి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామిని దర్శించుకున్నారు. 36,240 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
బీఎస్సీ నర్సింగ్
కోర్సుకు నీట్ రాయాలి
నెల్లూరు(అర్బన్): బీఎస్సీ నర్సింగ్ నాలుగు సంవత్సరాల కోర్సు, బీపీటీ 5 సంవత్సరాల కోర్సుల్లో 2026 – 27 సంవత్సరంలో చేరేందుకు నీట్ – యూజీ పరీక్షకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ ప్రభుదాస్ తెలిపారు. ఆయన ఆదివారం నెల్లూరులోని దిలీప్ నర్సింగ్ కళాశాలలోమాట్లాడారు. బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి ఈ సంవత్సరం నుంచి కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లకు కొత్తగా నీట్ పరీక్ష రాయాలనే నిబంధన వచ్చిందన్నారు. అయితే క్వాలిఫై కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఈనెల 8వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారికి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇతర వివరాలకు 98490 17633 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్


