ప్రభుత్వ భూమికి ఎసరు
● అధికార పార్టీ నేత నిర్వాకం
● నిరసన చేపట్టిన దళితులు
చిల్లకూరు: ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. టీడీపీ నేతలు ప్రత్యక్షమై ఆక్రమణకు పాల్పడుతున్నారు. బూదనంలో ఎన్నో సంవత్సరాలుగా దళితవాడకు చెందిన వారు చెత్త, పేడదిబ్బలు వేసుకునే సుమారు ఎకరాకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని ఆదివారం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యాడు. యంత్రాలతో చదును చేయడం ఆరంభించారు. దళితులు నిరసన చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆ భూమి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ టీడీపీ నేత ప్రభుత్వ భూమి ఆవలి వైపునున్న పట్టా భూమి సుమారు రెండెకరాలను ఇటీవల కొనుగోలు చేశారన్నారు. అందులోకి నేరుగా వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వ భూమిలో పేడదిబ్బలు తొలగించాడన్నారు. రెవెన్యూ అధికారులు నేతకు అండగా ఉన్నట్లు ఆరోపించారు. ఫోన్ కూడా ఎత్తకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు కూడా ఇక్కడ జరుగుతున్న తంతును వీడియోల ద్వారా తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. వెంటనే స్పందించి సర్వే చేయించి ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక వీఆర్వో భాస్కర్‌ను వివరణ కోరాగా పట్టా భూమిని కొనుగోలు చేసిన వారు దారి ఏర్పాటు చేసుకునే క్రమంలో పేడదిబ్బలున్న ప్రాంతంలో డ్రెయినేజీని ఏర్పాటు చేస్తున్నారన్నారు. అలాగే సర్వే చేయించి పట్టా భూమి వరకు వారు హద్దులు ఏర్పాటు చేసుకునేలా చూస్తామన్నారు.
ప్రభుత్వ భూమికి ఎసరు


