
ఇచ్చేదే అరకొర.. అందులోనూ కోతే
జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో పనిచేస్తున్న కోచ్‌లు, నాలుగో తరగతి ఉద్యోగులు ఏడాదిగా జీతాల్లేక అవస్థ పడుతున్నారు. వీరి కష్టాన్ని గుర్తించి ప్రతి నెలా అందజేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేసింది. తాజాగా వీరికి మరో షాక్ ఇచ్చింది. ఏడాదికి సంబంధించిన జీతాల్లో సగాన్నే జమ చేసి గందరగోళానికి గురిచేసింది. అసలు ఇలా ఎందుకు వ్యవహరించారనే అంశంపై ఎవరి వద్దా స్పష్టత లేకపోవడం గమనార్హం.
● డీఎస్‌ఏ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు
● ఏడాదిగా జీతాల్లేక ఆర్తనాదాలు
● ఎట్టకేలకు జమచేసినా.. అదీ సగమే
● క్రీడారంగ అభివృద్ధెలా..?
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): క్రీడాప్రాధికార సంస్థ నిర్వహణ తీరు లోపభూయిష్టంగా మారింది. వాస్తవానికి ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కోచ్‌లు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇచ్చే జీతమే స్వల్పం. ఈ మొత్తాన్నీ ఏడాది పాటు నిలిపి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీనిపై కలెక్టర్ మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ఈ అంశమై ‘జీతాల్లేవ్.. క్రీడల్లో శిక్షణ ఇచ్చేదెలా’ అనే శీర్షికన సాక్షిలో జూన్ 29న కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అధికారులు రెండు నెలల తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసి జీతాలిస్తామని ప్రకటించారు.
అకౌంట్ చూసి.. నిర్ఘాంతపోయి..!
ఎట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాల్లో జీతాలు బుధవారం రాత్రి జమయ్యాయి. అయితే సగమే పడటంతో నిర్ఘాంతపోవడం వారి వంతైంది. ఇలా ఎందుకు వ్యవహరించారనే విషయమై రాష్ట్ర, జిల్లా క్రీడాప్రాఽధికార సంస్థ అధికారులు నోరు మెదపడంలేదు.
జమైంది ఇలా..
డీఎస్‌ఏలో పనిచేసే కోచ్‌లకు జీతం రూ.21,500 కాగా, జమైంది రూ.12 వేలు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆకౌంటెంట్లకు రూ.20 వేల జీతం కాగా, వచ్చింది రూ.15 వేలే. ఆఫీస్ సబార్డినేట్, గ్రౌండ్స్ మార్కర్, స్వీపర్, వాచ్‌మెన్, ఇండోర్ స్టేడియం అటెండర్లు, క్లీనర్లకు రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.ఎనిమిది వేలను అందజేశారు. స్విమ్మింగ్ పూల్ స్వీపర్లు, వాచ్‌మెన్లు, ఎలక్ట్రీషియన్, వెంకటగిరి, గూడూరు సబ్ సెంటర్ల కేర్ టేకర్లు, ఓజిలి సబ్ సెంటర్ వాచ్‌మెన్‌కు ఇచ్చే జీతం రూ.15 వేలు కాగా, రూ.ఎనిమిది వేలనే జమ చేశారు.
అప్పులను ఎలా తీర్చాలో..?
వీరికిచ్చే జీతాలు అంతంతమాత్రమే. ఏడాది పాటు వేతనాలను నిలిపి అందులోనూ సగమే జమచేయడంతో ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. అప్పులను ఎలా తీర్చాలో పాలుపోక వీరు సతమతమవుతున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో క్రీడా రంగం అస్తవ్యస్థంగా మారే ప్రమాదం ఉంది. జీవితాలు బాగుండాలంటే క్రీడల్లో పాల్గొనాలని చెప్పే అధికారులు, ప్రజాప్రతినిధులు వీరిని విస్మరిస్తున్నారు. ఈ ఏడాది క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధికి ఎలాంటి ఆర్థిక సాయం చేయని కూటమి ప్రభుత్వం ఉద్యోగులనూ విస్మరించి తన మార్కును ప్రదర్శించింది.
ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం
శాప్ అధికారులకు తెలియజేశాం
సగం జీతాలే జమయ్యాయనే అంశాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అధికారులకు తెలియజేశాం. పూర్తిగా జీతాలొచ్చేందుకు అధికారులతో కలిసి యత్నిస్తాం.
– యతిరాజ్, డీఎస్డీఓ